MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, డిసెంబర్ 9 : మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రవీందర్ గౌడ్, నగేశగౌడ్, రాజుగౌడ్, దుర్గేందర్, మంగళి శ్రీను, సీనియర్ నాయకులు వెంకటేశ్ గౌడ్, మహేశ్ గౌడ్, నవీన్, ఆంజనేయులు, భూమయ్య తదితరులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రేస్ పార్టీ మోసపూరిత హామీలపై విరక్తి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యపడుతుందని వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని జోస్యం చెప్పారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు దారులు పెద్ద సంఖ్యలో విజయకేతనం ఎగరవేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.