ఖమ్మం రూరల్ : మున్సిపల్ ఎన్ని్కల్లో బీఆర్ఎస్- సీపీఎం కూటమిని ఓటర్లు చాలా గొప్పగా ఆశీర్వదించారని, తద్వారా కూటమి విజయవంతమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ (MLC Tata Madhusudan) అన్నారు. గురువారం సాయంత్రం ఎదురలాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి గణేష్ నగర్లో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది.
శుక్రవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎమ్మెల్సీ తాత మధుసూదన్ దిశా నిర్దేశనం చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్- సీపీఎం కూటమి మంచి ఫలితాలు సాధించిందని, మున్సిపల్ లోనూ జిల్లా వ్యాప్తంగా అంతకుమించి ఫలితాలు చూస్తామని, ఓట్ల శాతం పెరగనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ 10 రోజుల పాటు రేయింబవళ్లు కష్టించి పనిచేసిన ఇతర మండలాల ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కుల సంఘాల నాయకులకు తాత మధుసూదన్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ హాలులో జరిగే ఓట్ల లెక్కింపునకు.. ఉదయం 6గంటలకే అభ్యర్థులు ఏజెంట్లు హాజరు కావాలని ఆయన సూచించారు.
ఎన్నికల అధికారులు సూచించిన విధంగా నడుచుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమాలని 100 శాతం పాటించాలని తాత మధుసూదన్ కోరారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు.. అధికారికంగా ఫలితం వచ్చేవరకు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ అన్నారు. ప్రతి ఓటు ఎంతో విలువైందని.. నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఓకే చెప్పాల్సి ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి వార్డులను కైవసం చేసుకోబోతుందని, ఓటర్ల నమ్మకాలను వమ్ము చేయకుండా వార్డుల అభివృద్ధి. ప్రజాసంక్షేమం కోసం విజయం సాధించిన ప్రతి అభ్యర్థి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు డివిజన్ సీపీఎం కార్యదర్శి బండి రమేష్, మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్డి, రూరల్ మాజీ జడ్పీటీసీ ఎండపల్లి ప్రసాద్, నేలకొండపల్లి, తిరుమలయ్యపాలెం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య, భాష, బోయిన వీరన్న, సీపీఎం నేత నింద్రప్రసాద్తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.