హైదరాబాద్: అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆపసోపాలు పడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు హౌసింగ్ బోర్డు భూములను అమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని ఇండ్ల స్థలాలు, అమ్ముడుపోని ఫ్లాట్లను వేలం వేస్తున్నది. తద్వారా రూ.3,500 కోట్లకు పైగా నిధుల సమీకరించాలని లక్ష్యం పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో హౌసింగ్ బోర్డు స్థలాల అమ్మకాలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) స్పందించారు. భూములను అమ్ముకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హౌసింగ్ బోర్డును అభివృద్ధి చేశామన్నారు. 24 ఎకరాల హౌసింగ్ బోర్డు భూములను సుప్రీంకోర్టుకు వెళ్లి కాపాడుకున్నామని చెప్పారు. ఆ భూములను అభివృద్ధి చేయడం మానేసిన కాగ్రెస్ ప్రభుత్వం.. భూములను అమ్మి హైదరాబాద్‌ను నాశనం చేస్తున్నదని విమర్శించారు. 6 గజాల నుంచి 30 గజాల వరకు వేలం నిర్వహించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం హౌసింగ్ బోర్డు స్థలాన్ని వదిలేయాలని చెప్పారు. ఈ నెల 24న జరుగనున్న వేలం పాటను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
అమ్మకానికి సర్కారు భూములు
ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నది రేవంత్‌రెడ్డి సర్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని ఇండ్ల స్థలాలు, అమ్ముడుపోని ఫ్లాట్లను వేలం వేసి రూ.3,500 కోట్లకు పైగా నిధుల సమీకరణకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ వేలం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో మొత్తం 1,400కు పైగా ఓపెన్ ప్లాట్లు (100-500 చదరపు గజాల మధ్య), కరీంనగర్, ఖమ్మం, గద్వాల తదితరజిల్లాల్లో అమ్మకానికి సిద్ధం చేశారు.
వీటితోపాటు ఇంకా పూర్తికాని 361 ఇండ్లు అమ్మకానికి పెట్టారు. పోచారం, బండ్లగూడ, నాగోల్ సమీపంలోని రాజీవ్ స్వగృహ గేటెడ్ టౌన్‌షిప్‌లు, జవహర్‌నగర్, గాజులరామారం తదితర ప్రాంతాల్లో ఇంకా అమ్ముడుపోని 700 ఫ్లాట్లను కాంగ్రెస్ సర్కారు అమ్మే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఫ్లాట్లు 2007 నుంచి ఇప్పటివరకు అమ్ముపోకుండా ఉన్నాయి. 54 కేపీహెచ్‌బీ ఫ్లాట్లకు ఈ నెల 24న, గచ్చిబౌలి, బాలాజీనగర్, భరత్‌నగర్‌లోని ఏడు ఫ్లాట్లకు ఈ నెల 30న, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని 42 ఫ్లాట్లకు వచ్చేనెల 5న వేలం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా వాటికి ఫిబ్రవరిలో, మార్చిలో వేలం వేయనున్నట్టు తెలిసింది.
ఆర్థికలోటును పూడ్చుకొనే యత్నం
ఆర్బీఐ నుంచి అప్పుచేసినా బండి నడవకపోవడంతో ఆర్థికలోటును ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇండ్లస్థలాలు, అమ్ముడుపోని ఫ్లాట్లను వేలం ద్వారా విక్రయిస్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు రాష్ట్ర ఆదాయం రూ.1.03 లక్షల కోట్లుగా ఉన్నది. నిరుడు ఇదే కాలంలో రూ.1.11 లక్షల కోట్లు వచ్చింది. నవంబర్ చివరి నాటికి మొత్తం ఆదాయం సుమారు రూ.1.41 లక్షల కోట్లు ఉండగా, వ్యయాలు రూ.1.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈలోగా రూ.2,621 కోట్ల రుణాలు, చెల్లింపుల కోసం ఖర్చుచేశారు. దాంతో రాష్ర్టానికి రూ.14,288 కోట్ల ఆదాయ లోటు, రూ.37,850 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడింది. ఈ లోటును స్థలాలు, ఫ్లాట్ల వేలం ద్వారా పూడ్చుకోవాలని భావిస్తున్నది.