కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 5: తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని, కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. మళ్లీ తెలంగాణలోని నీళ్లను ఆంధ్రకు తరలించుకునే పోయే కుట్రలో భాగమే ఇదంతా సాగుతున్నదని ధ్వజమెత్తారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ లైవ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి గంగుల కమలాకర్‌తో పాటుగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే గంగుల విలేకరులతో మాట్లాడుతూ.. హరీశ్‌రావు ఇచ్చిన ప్రజంటేషన్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు కుల్లంకుల్లగా ప్రజలకు అర్థమైందన్నారు. ‘ప్రభుత్వం మాదే కదా.. అని కమిటీలు ఏ రిపోర్టు ఇచ్చినా మార్చుకోవచ్చు.. ప్రభుత్వంగా మేము ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని’ కొన్ని పేపర్లకు లీకులు ఇచ్చి కథనాలు రాపిస్తున్నారని విమర్శించారు. అది ఇప్పుడు సాగుతున్న కుట్ర కాదని, అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు నుంచే సాగుతున్న కుట్ర అని విమర్శించారు. ఆనాడు రాష్ట్రం రాకుండా ఏవైతే కుట్రలు జరిగాయో..? ఇప్పుడు మళ్లీ అదే కుట్ర మొదలైందన్నారు. కానీ ఆ రోజు తెలంగాణ సమాజం కేసీఆర్‌ను నమ్మిందని, కేసీఆర్ వెంట ఉండి పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఉత్తర తెలంగాణ కరువును దూరం చేసేదుకు 1963లో ఎస్సారెస్పీకి శ్రీకారం చుట్టి, 1977లో పూర్తి చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ నాయకులు ఎస్సారెస్పీ తర్వాత గోదావరిపై ఎక్కడైనా ఒక్క ఆనకట్టనైనా కట్టారా..? చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కడితే ఆంధ్రకు నీళ్లు రావన్న కుట్రతో ఆలోచన చేయలేదన్నారు.
ఇప్పుడు కూడా ఆంధ్రకు గోదావరిని తరలించుకుపోతున్నారని, 20 నెలలుగా మధ్యమానేరు, ఎల్ఎండీ, ఎల్లంపల్లి జలాశయాలు నీరు లేక ఏడారిగా మారిపోయాయన్నారు. ప్రస్తుతం గోదావరి నీళ్లు కిందికి పోతున్నాయని, చంద్రబాబు బనకచర్ల ప్రారంభించి మొత్తం నీటిని ఎత్తుకపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కన్నెపల్లి వద్ద ఎలాంటి కట్టడాలు కూలిపోలేదని, అక్కడ మోటర్లు ఆన్ చేసే నీళ్లు వస్తాయని, ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. కన్నెపల్లి ఆన్ చేస్తే మళ్లీ ఆంధ్రకు నీళ్లు రాకుండా పోతాయనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఇలాంటి కరువు పరిస్థితులను కొనసాగించి తెలంగాణ వెనకబాటుతనాన్ని కారణంగా చెప్పుకొని మళ్లీ ఆంధ్రలో కలిపే కుట్రలో భాగంగానే ఈ ప్రక్రియ సాగుతుందని మండిపడ్డారు. మేడిగడ్డ మరమ్మతులు చేయిస్తే ఇప్పటికే తెలంగాణకు నీళ్లు వచ్చేవన్నారు. ఆంధ్రకు వ్యతిరేకంగా తెలంగాణలో ప్రాజెక్టు కట్టి ఇక్కడ సస్యశ్యామలం చేయడం కేసీఆర్ చేసినా తప్పా అని ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ను ఖతం చేస్తే తమకు పోటీ లేదని, మళ్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రావాలె. హైదరాబాద్‌పై గద్దల్లా వాలాలె. తెలంగాణను ఆంధ్ర కలపాలే’ ఇదే కాంగ్రెస్ కోరుకుంటున్నదని ధ్వజమెత్తారు. ఆంధ్రవాళ్లు హైదరాబాద్‌లో గద్దలా వాలితే తెలంగాణ బిడ్డలు మళ్లీ దుబాయ్‌లకు పోవాలా..? అని ప్రశ్నించారు. ప్రజలందరూ కేసీఆర్ వెంటే ఉంటారని, ఇక వారి ఆటలు సాగవని తేల్చిచెప్పారు. మీరు ఏం చేస్తారో చేసుకోవచ్చునని ఏమైనా చర్యలు తీసుకుంటే తెలంగాణ భగ్గుమంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ వారందరు పారిపోయే పరిస్థితి వస్తుందన్నారు. అసెంబ్లీలో ఈ ఘోష్ ఇచ్చిన నివేదికను, కాంగ్రెస్ కుట్రను ప్రజల ముందు పెడుతామన్నారు. బనకచర్లను ఎందుకు మొదలుపెట్టారని, కాంగ్రెస్ అనుమతి లేకుండా మొదలుపెట్టారా..? అని ప్రశ్నించారు. ఇక్కడ నీళ్లు ఆగవద్దు కిందికి పోవాలని మేడిగడ్డపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే ఆనకట్ట కట్టి తెలంగాణకు నీళ్లు అందిస్తామని పేర్కొన్నారు.