MLA Gangula Kamalaker | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిప్పులు చెరిగారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలను గంగుల కమలాకర్ తప్పుబట్టారు. శాసనసభలో బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు.
42 శాతం రిజర్వేషన్లు రావాలని మా పార్టీ కూడా కోరుకుంటుంది. నేను బీఆర్ఎస్ పార్టీ తరపున మాట్లాడుతున్నా. 18 జీవో తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే.. ఇందిరా సహాని ప్రకారం కమిషన్ వేయమని చెప్పింది. ఆ తర్వాత 46 జీవో తీసుకొచ్చింది. సూచనను విమర్శగా భావించకండి.. మా సూచనను పరిగణనలోకి తీసుకొంది. బీహార్లో బీసీ రిజర్వేషన్లు ఫెయిల్ అయినట్టు కావొద్దు అని అంటున్నాను. నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1992 కింద మాత్రమే డెడికేటెడ్ కమిషన్ వేయాలి అని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందంటున్నారు. షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్లు చేర్చాలి. కాబట్టి సవరణ చేయాలి. అలా చేయకపోతే కోర్టుల్లో ఈ బిల్లు నిలబడదు. బీహార్, మధ్యప్రదేశ్లో కొట్టేశారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే 42 శాతం రిజర్వేషన్లకు ప్రొటెక్షన్ లభిస్తుంది. బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే.. ఈ ప్రకారం చేయండి. భూసాని వెంకటేశ్వర్ రిపోర్టును టేబుల్ చేయండి. బీసీలకు అన్యాయం జరగొద్దని శాస్త్రీయంగా చేయాలని కోరుతున్నాను అని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది.. ఇది సీఎం చేతుల్లోనే ఉంది. 42 శాతం మంత్రివర్గంలో కల్పిస్తామన్నారు. మంత్రివర్గంలో బీసీలకు అవకాశం కల్పిస్తే మేం సంతోషపడుతాం. ప్రతి ఏడాది కూడా 20 వేల కోట్లు బీసీలకు బడ్జెట్ పెడుతామన్నారు. ఇప్పటివరకు 20 నెలలు కావొస్తున్నా 20 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. దీనికి చట్టం అవసరం లేదు.. సీఎం తలచుకుంటే క్షణాల్లో అయిపోతది. ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడుతామన్నారు.. ఇవ్వండి. తెలంగాణలో ఏ వర్కు బీసీలకు ఇవ్వలేదు. బీసీల ఓట్లు గంపగుత్తగా ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చారు అని గంగుల కమలాకర్ మండిపడ్డారు.