Bala Krishna | తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన ఘనతను సాధించిన నటుడు నందమూరి బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. యూకే నుంచి ప్రత్యేక సన్మానం లభించింది. 50 ఏళ్లకు పైగా హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సినీ, రాజకీయ, సేవా రంగాల్లో విశేష కృషి చేసినందుకు గాను ఈ గౌరవం అందుకున్నారు. హైటెక్ సిటీలోని హోటల్ ట్రైడెంట్లో నిర్వహించిన ఈ వేడుకలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వయస్సు పెరుగుతున్నా నటనలో వన్నె తగ్గకుండా కొనసాగుతున్న మన బాలయ్య ప్రయాణం ‘అన్ స్టాపబుల్’. ఆయన సినీ ప్రయాణం, సామాజిక సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి అని పేర్కొన్నారు.
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి స్థాపనతో వేలాది మంది రోగులకు నిస్వార్థంగా సేవలు అందించిన బాలకృష్ణను బండి సంజయ్ కొనియాడారు. సినిమాల్లో పౌరాణికం నుంచి సామాజికం వరకు విస్తృత శ్రేణిలో పాత్రలు పోషించి, ఎన్టీఆర్ నట వారసుడిగా ఆయనకు విశేషమైన గుర్తింపు దక్కిందని తెలిపారు. పద్మభూషణ్ అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు లాంటి గౌరవాలు బాలయ్య విశిష్టతను నిరూపిస్తున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, ఎమ్మెల్యేగా చూపుతున్న క్రియాశీలత ఎంతో ప్రశంసనీయం అని అన్నారు. ఇలా బాలయ్యపై బండి సంజయ్ ప్రశంసల జల్లు కురిపించారు.
ఇక ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య సినీ జీవితం ఇంకా ఎన్నో గొప్ప మైలురాళ్లు సాధించాలని అందరూ ఆకాంక్షించారు. . మరోవైపు బాలకృష్ణ దాతృత్వం చాటుకున్నారు. కామారెడ్డి వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు. ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరద విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ 2 చిత్రంతో బిజీగా ఉండగా, ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు తెలుస్తుంది.