న్యూఢిల్లీ: కుమారుని పుట్టిన రోజు సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకునే బహుమతుల విషయంలో భార్య, భర్తల మొదలైన పంచాయితీ ఇద్దరి హత్యకు దారితీసింది. దంపతుల మధ్య లొల్లిని పరిష్కరించాలని చూసిన అత్తను, కట్టుకున్న భార్యను చంపిన ఘటన ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 17లో (Delhi) చోటుచేసుకుంది. యోగేశ్ సెహగల్ అనే వ్యక్తి తన భార్య ప్రియ(27), కుమారుడు చిరాగ్‌తో కలిసి రోహిణిలోని సెక్టార్ 17లో ఉంటున్నారు. ఈ నెల 28న చిరాగ్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన బహుమతుల విషయంలో భార్యాభర్తలకు మధ్య జరిగింది. వేడుకలో పాల్గొనడానికి వచ్చిన అత్త కుసుమ్ సిన్హా (63).. వారిద్దరి మధ్య గొడవను పరిష్కరించడానికి అక్కడే ఉండిపోయారు.
ఏ ఉద్యోగం చేయకుండా ఉన్న యోగేశ్‌కి, ప్రియకి మధ్య తరచూ గొడవలు జరుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో వారి మధ్య బేధాప్రాయాలను తొలగించడానికి మరుసటి రోజు ఇరువురితో కుసుమ్ మాట్లాడాలనుకున్నారు. అయితే ఆగ్రావేశాలకు లోనైన యోగేశ్.. భార్య, అత్తలను కత్తెరతొ పొడిచి చంపేశారు. అనంతరం ఇంటికి తాళం వేసి, కొడుకును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం ఇంటికి వస్తానని చెప్పిన తల్లి.. రాకపోవడంతో ఆమె కుమారుడు మేఘ్ సిన్హా తల్లి కుసుమ్కు ఫోన్ చేశారు. ఎంతకు ఫోన్ ఎత్తకపోవడంతో ప్రియ ఇంటికి వెళ్లి చూశారు. అయితే తలుపు తాళం వేసి ఉండటం, దానికి రక్తపు మరకలు ఉండటంతో.. చుట్టుపక్కల వారిని పిలిచి, తలుపును బద్దకొట్టారు. అప్పటికే రక్తపు మడుగులో తల్లి, సోదరి విగతజీవులుగా పడిఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడు యోగేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్య వెనుక అసలు కారణాలు ఇంకా తెలియ రాలేదని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తెరలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నామని, వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నామని వెల్లడించారు.