ఎల్లారెడ్డిపేట, మార్చి 15 : కాంగ్రెస్ సర్కార్ సాగునీటి పనులపై వివక్ష చూపుతున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చెరువు ఆయకట్టు రైతులు మండిపడ్డారు. మెట్ట ప్రాంత రైతుల కల నెరవేర్చేలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ కింద వీర్నపల్లి, కోనరావుపేట మండలాలకు నీరందించేందుకు చేపట్టిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ సర్కార్ తాత్సారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా మద్దిమల్ల రాయిని చెరువుకు సంబంధించిన రెండు కిలోమీటర్ల పైప్లైన్ పనులు చేపట్టక పోవడం దారుణమని అన్నారు. కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనుల్లో భాగంగా మద్దిమల్ల రాయిని చెరువులో మిగిలిపోయిన పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాయిని చెరువులో రైతులు టెంట్ వేసి నిరసన తెలిపారు. మెట్ట ప్రాంత రైతుల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు సాగునీటి యజ్ఞం చేపట్టారని తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ ద్వారా నీరందించలేని ఎగువ ప్రాంతాలైన వీర్నపల్లి, కోనరావుపేట మండలాలకు సైతం నాలుగు లిఫ్టులతో నీటిని ఎత్తిపోయించేందుకు కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ కింద రూ.166 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు.
అందులో భాగంగా అల్మాస్పూర్, శివంగాలపల్లి, మూలవాగు, హన్మాజీ చెరువులను, అలాగే వీర్నపల్లి మండలంలోని ఎనిమిది చెరువుల్లో నీళ్లు నింపేందుకు పనులు మొదలు పెట్టారని చెప్పారు. మద్దిమల్ల రాయిని చెరువును నింపి, కంచర్లలోని వెంకట్రాయని చెరువు, రేండ్ల కుంట, పోతరాయనికుంట, అల్మాస్పూర్ రంగం చెరువుల్లో నీళ్లు నింపేలా ప్రణాళికలు రూపొందించారని వివరించారు. 2023 ఫిబ్రవరిలో అల్మాస్పూర్ లిఫ్ట్ నుంచి రాయిని చెరువు నింపడానికి 15.716 కిలోమీటర్ల పొడవున పైప్లైన్ నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. 375 మీటర్ల పొడవున కట్టను పునరుద్ధరించారని, మత్తడి మరమ్మతులు చేశారని, రెండు కొత్త తూములను నిర్మించినట్టు చెప్పారు. 13 కిలోమీటర్ల పైప్లైన్ పూర్తి చేశారని, అప్పుడు అటవీ శాఖ అనుమతుల కారణంగా మరో రెండు కిలోమీటర్లు ఆగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లయినా రెండు కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు పూర్తి చేయలేక పోయిందని మండిపడ్డారు. ఈ పైప్లైన్ పూర్తయితే 12 గ్రామాలకు నీళ్లందుతాయని, 13వేల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పనులు పూర్తి చేసి, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో సర్పంచ్లు ప్యాట్ల రవి, సామల్ల దేవరాజు, సుధాకర్, బట్టు కృష్ణ, గుగులోత్ రమేశ్, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, నాయకులు మల్లారపు అరుణ్, బోయిని రవి, గుగులోత్ సురేశ్, గుగులోత్ రవిలాల్, రఫీ, రైతులు పాల్గొన్నారు.