Kaleshwaram | యాసంగిని బతికించిన ‘కాళేశ్వర’ గంగ.. రివర్స్ పంపింగ్ ద్వారా రెండుసార్లు కాళేశ్వరం నీళ్లు
‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది.. దీనివల్ల ప్రయోజనమేమీ లేదు.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది’ అంటూ ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అది అవాస్తవమని తెలిసినా ప్రచారం మాత్రం మానలేదు.
Kaleshwaram | మోర్తాడ్, మార్చి 15: ‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది.. దీనివల్ల ప్రయోజనమేమీ లేదు.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది’ అంటూ ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అది అవాస్తవమని తెలిసినా ప్రచారం మాత్రం మానలేదు. నిజంగానే కుంభకోణం జరిగిందని ప్రజలు భావించేలా కమిషన్లు, కమిటీలంటూ తెగ హడావుడి చేశారు. సోషల్ మీడియాలోనూ అదే తరహాలో ప్రచారం చేశారు. అయితే అదే కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు నేడు వరద కాలువలోకి రాకపోతే పరిస్థితి ఏమిటో కాలువ చుట్టుపక్కల ఉన్న ప్రతి రైతుకు తెలుసు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద గండి పడటంతో ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు నీళ్లు వచ్చే అవకాశం లేకుండాపోయింది. దీంతో రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలతో రెండుసార్లు వరద కాలువను నింపారు. ఫలితంగా యాసంగి పంటలకు కాళేశ్వరం జలాలు వరప్రదాయినిగా మారాయి. వరదకాలువకు గండిపడి కష్టకాలం దాపురించిన వేళ.. బాల్కొండ నియోజవర్గంతోపాటు జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో పంటలకు సాగునీరు అందిస్తున్నది కాళేశ్వరం గంగ మాత్రమే.
ఆదుకున్న పునరుజ్జీవ పథకం..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా మార్చారు. ఇందుకోసం ప్రపంచమే అబ్బురపడేలా భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. వరి సాగులో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. వృథాగా సముద్రంలోకి పోయే నీటిని ఒడిసిపట్టి గంగను ఎదురెక్కించిన ఘనత కేసీఆర్‌ది. అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ భవిష్యత్తును కాపాడారు. ఎస్సారెస్పీ పరిధిలోని రైతులకు సాగునీటి గోస ఉండొద్దన్న ఉద్దేశంతో పునరుజ్జీవ పథకాన్నిచేపట్టారు. అందులో భాగంగానే నంది పంప్‌హౌస్, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడంతో జగిత్యాల జిల్లా రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్ వరకు కాళేశ్వరం జలాలు చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి ఎత్తిపోయడం ద్వారా నిజామాబాద్ జిల్లాలోని వరద కాలువ నిండుకుండలా మారింది.
వరద కాలువకు గండిపడితే..
గత ఏడాది అక్టోబర్ 9న నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండిపడింది. ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల లేక వరదకాలువ బోసిపోయింది. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలను జనవరి, మార్చిలో రెండుసార్లు నింపడంతో నాలుగు జిల్లాల పరిధిలోని వరదకాలువ ఆయకట్టు యాసంగి పంటలకు సాగునీటికి ఢోకాలేకుండా పోయింది. కాళేశ్వరం కుప్పకూలిందని దుష్ప్రచారం చేస్తున్న వారికి నిండుగా కనిపిస్తున్న వరద కాలువే సమాధానం చెప్తున్నది.
యాసంగి పంటలను గట్టెక్కించి..
గత ఏడాది అక్టోబర్‌లో వరద కాలువకు గండి పడటంతో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని అందించాలని రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వరద కాలువ సీఈ, గాయత్రీ పంప్‌హౌస్ సీఈ సుమతీదేవి, శ్రీనివాస్‌గుప్తాతో మాట్లాడి రివర్స్‌పంపింగ్ ద్వారా వరద కాలువకు నీటిని అందించి, రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీంతో అధికారులు ఈ ఏడాది జనవరిలో పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని వరద కాలువలోకి ఎత్తిపోయగా ఆ జలాలు నిజామాబాద్ జిల్లా గాండ్లపేట వరకు చేరాయి. వరద కాలువకు గండి పడినచోట మరమ్మతు పనులను పరిశీలించేందుకు వచ్చిన సీఈ సుమతీదేవిని రైతులు కలిసి మరోసారి నీళ్లు ఎత్తిపోయాలని కోరారు. దీంతో ఈ నెల 5న మరోసారి వరద కాలువలోకి కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఎర్రజొన్న, మక్కజొన్న, వరి పంటలకు సాగునీటికి ఢోకా లేకుండాపోయింది.
కాలువలో మట్టికట్ట నిర్మించిన రైతులు
గాండ్లపేట వద్ద గండిపడటంతో వరద కాలువలో నీటిని నిల్వ చేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల రైతులు సొంత ఖర్చులతో వరద కాలువలో మట్టి కట్ట నిర్మించారు. ఈ ఏడాది జనవరిలో రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చిన నీరు ఆ కట్ట వరకు చేరుకోగా కాలువ నిండుగా మారింది. యాసంగి పంటలకు సాగునీటికి ఢోకా లేకుండాపోయింది. కాలువ నిండుగా మారడంతో భూగర్భ జలాలు వృద్ధిచెందాయి. దీంతో బోరుబావులపై ఆధారపడి పంటలు పండించే రైతులకు కూడా లాభం చేకూరుతున్నది. కాళేశ్వరం జలాలు రాకపోతే పంటలు మొత్తం ఎండిపోయి తీవ్రంగా నష్టపోయే వాళ్లమని రైతులు చెప్తున్నారు.
కాళేశ్వరమే ఆదుకున్నది..
వరద కాలువకు గండిపడటంతో కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని కోరినం. నీళ్లు వస్తాయని తెలిసి వరద కాలువలో మట్టి కట్టను నిర్మించుకున్నం. రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువకు నీళ్లు తేవడంతో పంటలను కాపాడుకోగలిగినం. ఎర్రజొన్న, మక్కజొన్న పంటలు చేతికచ్చినయ్. వరద కాలువల నిండా నీళ్లు ఉన్నాయి. మిగిలిన పంటలకు కూడా సమస్య లేదు. వరదకాలువ నీళ్లు లేకపోతే మాత్రం వేసిన పంటలన్నీ నష్టపోయేవాళ్లం.
– నారాయణ రైతు, కమ్మర్పల్లి, నిజామాబాద్ జిల్లా
బోర్లు మంచిగా పోస్తున్నయ్..
వరద కాలువలకు నీళ్లు రావడంతో భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లు మంచిగా పోస్తున్నాయి. యాసంగి పంటలకు ఢోకా లేకుండా పోయింది. గండి పడ్డచోట పనులు తొందరగా పూర్తయితే, వరద కాలువకు ఎస్సారెస్పీ నీళ్లు ఎప్పుడూ వస్తూనే ఉంటయి. దాంతో చెరువులు నింపుకోవడంతోపాటు వరద కాలువకు ఇరువైపులా భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండవు. గండి పనులు తొందరగా పూర్తిచెయ్యాలి.
– పార్శపు పెద్దిరెడ్డి, రైతు, కమ్మర్పల్లి, నిజామాబాద్ జిల్లా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

