కరీంనగర్ ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) / కలెక్టరేట్ : కరీంనగరంలోని కిసాన్‌నగర్‌లో పోలీసులు జులుం ప్రదర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు నాయకులు అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. గంగులతోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం 28వ డివిజన్ పరిధిలోని కిసాన్ నగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. బీఆర్ఎస్కు చెందిన ఓ కార్యకర్త వద్ద డబ్బులు దొరికాయని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వాహనంలో ఎక్కించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమ పార్టీ కార్యకర్తను విడిపించారు.
ఓటర్లను ప్రలోభ పెడుతున్న కాంగ్రెస్ నాయకులను వదిలి తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు. కరీంనగర్లో కాంగ్రెస్ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని, ప్రశాంతమైన నగరంలో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌లు, కేసులు సరికాదని, ప్రభుత్వం ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని హితవు పలికారు. ఇంతలో సీపీ గౌష్ ఆలం అక్కడికి చేరుకోగా, బీఆర్ఎస్పై ఎందుకిలా కక్ష కడుతున్నారంటూ ప్రశ్నించారు. పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు.
తర్వాత ఆందోళన విరమించారు. ఆ తర్వాత ఎన్నిక నియమావళిని ఉల్లంఘించారంటూ పోలీసులు.. ఎమ్మెల్యే గంగులతోపాటు 28వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కుర్ర తిరుపతి, నాయకులు ఎడ్ల అశోక్, అమరగొండ అశోక్, ఎడ్ల సరిత, పెరుక మంజుల, బెజుగం మధుపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని త్రీ టౌన్ సీఐ గుర్రం తిరుమల్ తెలిపారు. అంబేద్కర్ నగర్‌కు చెందిన కుర్ర తిరుపతి వద్ద 44,500 లభించాయని, కేసు నమోదు చేశామని చెప్పారు. అలాగే కిసాన్ నగర్‌కు చెందిన లోకిని జంపయ్య వద్ద 47 వేలు దొరికాయని, ఆయనపై మరో కేసు నమోదు చేశారు.

58వ వార్డులో లాఠీచార్జి
కరీంనగర్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్లో స్వల్ప లాఠీ చార్జీ జరిగింది. 58వ డివిజన్లోని జడ్పీ కార్యాలయంలో పోలింగ్ బూత్‌కు మహిళ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. ఆమె అప్పటికే ఓటు వేసినట్టు ఉందని పోలింగ్ సిబ్బంది చెప్పారు. ఈ విషయాన్ని ఆ మహిళ బయటకు వచ్చి చెప్పుకోగా, అక్కడే ఉన్న కొందరు బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ శ్రేణులపై ఆరోపణలు చేయగా, అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు తిప్పికొట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. సీపీ గౌష్ ఆలం అక్కడికి చేరుకొని, ఇరువర్గాలను చెదర గొట్టేందుకు లాఠీచార్జి చేయించగా, కార్యకర్తలు రోడ్లపై పరుగులు తీశారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా తమ కార్యకర్తలను ఎందుకు కొడుతున్నారని 58 డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
వేములవాడలో చెత్త వాహనంలో ఆహారం
వేములవాడ, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు అధ్వానంగా మారాయి. వేములవాడ పట్టణంలో యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. 20వ వార్డుల్లోని అంబేదర్ నగర్, 21వ వార్డు ఉప్పుగడ్డ వీధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి వసతి సౌకర్యాలు లేకపోవడంతో పోలింగ్ సిబ్బంది కింద కూర్చుండే విధులు నిర్వహించారు. ఇదిలా ఉంటే పట్టణంలోని 58 పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి మధ్యాహ్నం భోజనాన్ని చెత్త వాహనంలో తీసుకువచ్చి అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడువాసనతో తినలేకపోయామని సిబ్బంది మండిపడ్డారు.
ఎన్నికల సిబ్బంది నిరసన
వేములవాడ, ఫిబ్రవరి 11: వేములవాడ పట్టణంలోని మెజార్టీ పోలింగ్ కేంద్రాల్లో వసతులు లేకపోవడం, విధుల నిర్వహణకు వాడకంలో లేని భవనాలను కేటాయించడంపై ఎన్నికల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు నిర్వహించి సాయంత్రం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నాక అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రెమ్యునరేషన్ ఇతర జిల్లాల్లో 1300 ఉంటే, ఇక్కడ 800 మాత్రమే ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో ఆర్డీవో రాధాబాయి, జిల్లా సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
రామగుండంలో ఆందోళన
యైటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 11: రామగుండం 17వ డివిజన్ సంతోషినగర్‌లో ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల వద్ద ఉండాల్సిన ఓటరు జాబితాను కాంగ్రెస్ అభ్యర్థి సమీప బంధువు బయటికి తీసుకువస్తుండగా, అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై వారు ఎన్నికల అధికారులను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళన చేపట్టారు. పోలింగ్ అధికారులు, పోలీసులు కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఉంటూ ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల బూత్‌లోకి కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నిసార్లు వెళ్లినా అభ్యంతరం చెప్పడం లేదని, తమ పార్టీల అభ్యర్థులను సమీపంలోనికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు, టూటౌన్ సీఐ ప్రసాద్‌రావు వచ్చి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.