Amitabh Bachchan |బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ వయస్సులో కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. సినిమాలు, షోస్, యాడ్స్ ఇలా బిగ్ బీ సంపాదన రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. అయితే మధ్య మధ్యలో కాస్త విరాళాలు కూడా అందిస్తూ ఉంటారు. తాజాగా ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా గణపతి మండపానికి రూ. 11 లక్షలు విరాళంగా ఇచ్చారు. స్వయంగా వెళ్లి ఇవ్వకపోయినా, తన బృందం ద్వారా చెక్కును పంపించి, మండల్ కార్యదర్శి సుధీర్ సాల్వికి అందజేశారు. చెక్కు స్వీకరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమితాబ్ విరాళాన్ని పలువురు అభినందించగా, మరోవైపు కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం తీవ్ర వరదలతో అతలాకుతలం అవుతోంది. 1988 తర్వాత ఇంతటి తీవ్రతతో వచ్చిన వరదలు ఇవే. వేల గ్రామాలు నీటమునిగి, వేల ఎకరాల పంట నష్టం చెందగా, ప్రజలు నివాసాలు కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో, పలువురు సినీ ప్రముఖులు పంజాబ్ వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమితాబ్ బచ్చన్ గణపతికి భారీ విరాళం ఇవ్వడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఈ డబ్బుతో పంజాబ్ బాధితుల కోసం సహాయం చేసి ఉంటే మంచిది కాదా?’’, ‘‘దేవునికి కాదు, మానవాళికి సహాయం చేయండి’’ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.
మరికొందరు అయితే, ‘‘విరాళాలపై సెలెబ్రిటీలకు ఓ సమతౌల్యం ఉండాలి. మతపరమైన మార్గాల్లో కాకుండా మానవతా దృష్టితో ముందుకు రావాలి’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా, ‘‘బిగ్ బీ సార్.. పంజాబ్ బాధితుల కోసం ఒక్కరిని అయినా దత్తత తీసుకుని ఉంటే ఎంతో ఆదర్శంగా ఉండేది’’ అని మరికొందరు సూచనలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే, అమితాబ్ బచ్చన్ చేసిన విరాళాన్ని ఒక వర్గం ప్రశంసిస్తుండగా, మరో వర్గం మాత్రం ప్రస్తుత అవసరాల నేపథ్యంలో విరాళాల ప్రాధాన్యతను పునఃపరిశీలించాలని సూచిస్తోంది.