India Embassy : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో జరుగుతున్న ఘర్షణలను ప్రస్తావిస్తూ అమెరికా మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్ (Newyork Times)’ రాసిన కథనం వివాదానికి దారితీసింది. ‘స్థానిక ఎన్నికలు ప్రారంభం కాగానే పాకిస్థాన్ కశ్మీర్లో ఘర్షణలు చెలరేగాయి’ అంటూ ఆ కథనానికి శీర్షిక పెట్టింది. దీనిపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) తీవ్రంగా స్పందించింది. ఆ కథనంలో పాకిస్థాన్ కశ్మీర్ అనే ప్రస్తావనను తీవ్రంగా ఖండించింది.
‘అది తప్పుదోవ పట్టించే శీర్షిక. పాకిస్థాన్ కశ్మీర్ అంటూ ఏదీ లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే (POK). కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమే. వీటిలోని కొన్ని భాగాలను పాకిస్థాన్ (Pakistan) చట్టవిరుద్ధంగా ఆక్రమించింది. ఇప్పుడు అక్కడి ప్రజలపై హింసకు పాల్పడుతోంది’ అని భారత ఎంబసీ మండిపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తోన్న ఎన్నికల సందర్భంగా నిరసనకారులు, భద్రతాదళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఆందోళనకారులపై పాకిస్థాన్ భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో.. ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడాన్ని నిషేధించారు. మరోవైపు ఆందోళనల్లో చనిపోయిన తమవారి మృతదేహాలను భద్రతాదళాలు ఇవ్వడంలేదని పలు కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, పాలనాపరమైన సమస్యలు, రాజకీయ వివక్ష వంటి అంశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనలకు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వం వహిస్తున్నది.
కాగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించడంపై భారత్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న కపట ప్రయత్నాల్లో అవి భాగమని దాయాదిని దుయ్యబట్టింది.