టేకులపల్లి. జనవరి 07 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి స్కూల్లో మధ్యాహ్న భోజనం మోనూ ప్రకారం పెట్టడం లేదని, రోజు పప్పుచారునే పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వంట నిర్వాహకురాలు రోజూ అన్నం, నీళ్లచారే వడ్డిస్తుండడంతో భోజనం చేయలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం సరిపడా పెట్టట్లేదని ఆరోపించారు. ప్రతిరోజు నీళ్ల చారు, నెలకు ఒక్కసారే కోడిగుడ్డు పెడుతుందన్నారు. గంటే చారు, పిరికేడు అన్నంతో సరిపెట్టుకోవాలని వంట నిర్వహకురాలు ఆదేశిస్తుందని తెలిపారు. విషయాన్ని ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. బియ్యం మిగిల్చుకుంటూ ఇద్దరు చేయాల్సిన వంట ఒక్కరే చేస్తుందని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ విషయమై హెచ్ఎం మంగీలాల్‌ను వివరణ కోరగా ప్రతి రోజు పప్పునే పెడుతున్న మాట వాస్తవమే అన్నారు. వంట నిర్వాహకురాలు వాస్తవంగా కొడిగుడ్లు పెట్టడం లేదన్నారు. నాణ్యతతో పెట్టమని హెచ్చరిస్తునే ఉన్నామని, అయినా వీనడం లేదని హెచ్ఎం తెలిపారు.