కోదాడ, జనవరి 07 : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ అన్నారు. రోడ్డు భద్రత మహోత్సవంలో భాగంగా బుధవారం కోదాడ పట్టణంలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో డ్రైవర్లు, యజమానులకు అలాగే తేజ పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పక పాటించాలన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు అనుగుణంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ సందర్భంగా పలు రకాల చట్టాలను జడ్జి వివరించారు.
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని మాట్లాడుతూ.. డ్రైవర్లు అతివేగాన్ని నియంత్రించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. లారీ యజమానులు తమ వాహనాల ఫిట్నెస్ విషయంలో రాజీ పడకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ, బార్ సోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఉయ్యాల నరసయ్య, కోదాడ అసోసియేషన్ అధ్యక్షుడు తునాం కృష్ణ, సెక్రటరీ యలమందల నరసయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు పైడిమర్రి వెంకటనారాయణ, ఆవుల రామారావు, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, లారీ అసోసియేషన్ జానీ, సమ వెంకటరెడ్డి, పెద్ది చంద్రమౌళి, గుండపునేని నాగేశ్వరరావు, విలాస కవి నరసరాజు, పెద్ది అంజయ్య, పాఠశాల యాజమాన్యం సంతోష్ కుమార్, జానకి రాములు, సోమ నాయక్ పాల్గొన్నారు.