ఖమ్మం రూరల్, జనవరి 07 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా వాటి పరిధిలో 69 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ రోల్ ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అధికారులు ఆయా రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలను సైతం స్వీకరించారు. ఒకవైపు ఓటరు తుది జాబితా రూపొందించే పనిలో ఉన్న మున్సిపల్ అధికారులు మరోవైపు పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ల రూట్ మ్యాప్, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన నిర్వహణ సిబ్బంది, అధికారుల నియామక ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమయ్యారు. గతంలో మున్సిపాలిటీ ఏర్పాటు కాకముందు మొత్తం 65 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఈ దఫా ఎన్నికల్లో అదనంగా మరో నాలుగు పోలింగ్ బూత్‌లను ఈఎంసీ అధికారులు గుర్తించారు. ప్రతి 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొత్తం 69 పోలింగ్ బూత్‌లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పోలింగ్ బూతుల ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నారు.