బీబీనగర్, జనవరి 07 : కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించట్లేదని ఆరోపిస్తూ హోలియా దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్, బీబీనగర్ మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీబీనగర్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వారు వెల్లడించారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకే అంకితభావంతో పని చేశామని, తాతల కాలం నుండి పార్టీని నమ్ముకుని నడిచామని తెలిపారు. ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేశామని, కానీ గెలిచిన అనంతరం తమకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తమను రాజకీయంగా ఉపయోగించుకుని చివరకు అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ర్టవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై తాము నిరంతరం పోరాటం చేశామని, కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో తమ వర్గానికి నష్టం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు తమ కులాన్ని వాడుకుని వదిలేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు.
మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై, అలాగే భువనగిరి ఎమ్మెల్యేపై ఉన్న అభిమానంతోనే పార్టీకి కట్టుబడి పని చేశామని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు నాయకులు తమ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. పార్టీ కోసం నమ్మిన బంటులా పనిచేసిన తమను మోసం చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే వారికి ప్రాధాన్యత తగ్గిందని, ఎన్నికల ముందు ఉన్న గౌరవం గెలిచిన తర్వాత లేకపోవడమే తమ రాజీనామాకు కారణమని తెలిపారు.