– ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే పోలీసుల పైశాచికం
– రాష్ట్రం తెచ్చిన మహానీయుడి పైనా కుట్రలు
– హోం మంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం.. రాజీనామా చేయాలి
– కోదాడలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
కోదాడ, సెప్టెంబర్ 08 : అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై పోలీసుల దుశ్చర్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ మంగళవారం కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదేమి రాజ్యం.. పోలీసు రాజ్యం.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కర్కశ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేలన్న కనీస గౌరవం లేకుండా పోలీసులతో ముఖ్యమంత్రి దాడి చేయించారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందని ఈ సంఘటనతో నిర్ధారణ అయిందన్నారు. హోం మంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అనైతిక దానిని ఖండించాల్సింది పోయి పోలీసులను వెనకేసుకు రావడం పట్ల కుట్ర దాగి ఉందన్నారు.
14 సంవత్సరాలు అలుపెరగకుండా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాంగ్రెస్ గుండాలను పంపాడని ముఖ్యమంత్రిగా రేవంత్ ఒక్క నిమిషం కూడా పాలన చేసేందుకు అర్హుడు కాదని తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకే భద్రత కల్పించలేని ఆయన ప్రజల భద్రత ఏం చూస్తాడని ఘాటుగా విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేల పై పోలీసుల అసభ్య ప్రవర్తన కౌరవ సభను, దుశ్శాసన పర్వాన్ని గుర్తు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో ఆచరణకు సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఈ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీలో సభను పక్కదారి పట్టిస్తున్నారని స్పష్టమవుతుందన్నారు.
పదేపదే తెలంగాణ రాష్ట్ర సాధకుడు కెసిఆర్ పై అమానవీయంగా రేవంత్ రెడ్డి దుర్భాషలాడి ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చుతున్నాడన్నారు. కేసీఆర్ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మి వేసినట్లేనన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు బట్టు శివాజీ, జానకి, రామాచారి, తాళ్లూరి శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, కందిమండ సత్యనారాయణ, శీలం సైదులు, మధుసూదన్ రెడ్డి, దేవల నాయక్, జానీ పాషా, ఎస్కే నయీమ్, చీమ నరేష్, భాగ్యమ్మ, అబ్బు శ్రీకాంత్, క్రాంతి, వెంకట్, ఉపేందర్ గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలపై దుశ్చర్య : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్