BRS |ఖానాపూర్: ప్రజా సమస్యలు, కాంగ్రెస్ మోసపూరిత హామీలు, విఫల పాలనపై ప్రజాస్వామ్యబద్ధంగా, శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ శాసన సభ, శాసన మండలి సభ్యులను అడ్డుకోవడం, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులను నిరసిస్తూ మంగళవారం ఖానాపూర్ తెలంగాణ చౌక్ వద్ద మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం తెలంగాణ చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యాలను నిరసిస్తూ రూపొందించిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ ప్రజాపాలన పేరుతో ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటు అని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన అసహనాన్ని బయటపెట్టుకుంటోందని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్‌రెడ్డి శాసనసభ సభ్యుల హక్కులను కాలరాసేలా చేసిన కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తోందని త్వరలోనే రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Johnson Naik 1
అధికారం చేపట్టి వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన ఈ ప్రభుత్వానికి తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. కేటీఆర్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరడం విడ్డూరంగా ఉందని విమర్వించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ హక్కును హరించాలని చూడటం సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వమని మండిపడ్డారు.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల సమస్యలపై పోరాడటానికి బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్ తొడసం ఇందిర, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఈశ్వరీబాయి, మాజీ జడ్పీటీసీ రామునాయక్, బీఆర్ఎస్ నాయకులు అబ్బుల్ ఖలీల్, పుష్పాల గజేందర్, కొక్కుల ప్రదీప్, గౌరికర్ రాజు, సల్ల నరేందర్, శనిగారపు శ్రావణ్, నల్ల జీవన్‌రెడ్డి, కారింగుల సుమన్, నాగేందర్రావు, గాండ్ల శంకర్, రాజేశ్వర్ గౌడ్, బాపురావు, వాల్సింగ్, ధరంసోత్ వసంత్, లింగన్న, పానగంటి రాజేందర్, మహిపాల్, కొక్కుల శేఖర్, అజ్మీరా కవిత, కళావతి పాల్గొన్నారు.