హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరను ఘనంగా నిర్వహిద్దామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వచ్చే ఏడాది జాతర జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి అమ్మవారి ఆశీయస్సులు పొందేవిధంగా సమష్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
గతంలో జాతర నిర్వహించిన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. ఈ సారి మరింత మెరుగ్గా పని చేయాలని ఆదేశించారు. గత జాతర పూర్తయ్యాక కరోనా లాక్డౌన్ పెట్టుకున్నామని, ఈ సారి జాతరకు ముందు సంపూర్ణంగా కరోనా మహమ్మారి నశించాలని అమ్మవార్లను కోరుకున్నానన్నారు. జాతరకు వంద రోజుల సమయం మాత్రమే ఉందని, సీఎం కేసీఆర్ జాతరకు భారీగా నిధులు మంజూరు చేసి ఘనంగా జరుపుతున్నారన్నారు.
జాతరకు సంబంధించి ఏఏ ఇబ్బందులున్నాయని ఇప్పటికే గుర్తించారని, చుట్టు పక్కల జరిగే చిన్న జారతలకు కూడా నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. పకడ్బందీగా మౌలిక వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో రూ.75కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సారి అధికారులంతా కలిసికట్టుగా పని చేసి, జాతరకు వచ్చే భక్తులకు అన్నివసతులు కల్పించాలన్నారు.
ఇప్పటికే రూ.120కోట్ల ప్రతిపాదనలు కలెక్టర్ ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. మూడు చెక్‌డ్యామ్‌లు తొలగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, అదనపు ఓహెచ్ఆర్సీలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అదనపు బ్లాక్స్, నూతన డైనింగ్ హాల్స్ కట్టనున్నట్లు చెప్పారు. స్థానికంగా నేల స్వభావంతో రోడ్లు కొంగుతున్నాయని, వీటికి మరమ్మతులు చేయనున్నట్లు పేర్కొన్నారు.
జంపన్న వాగు వద్ద రెండు దుస్తులు మార్పిడి చేసుకునేందుకు గదులతో పాటు పోలీసులకు శాశ్వతంగా వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గుంజేడు ముసలమ్మ జాతరకు వసతులు కల్పించాలని విజ్ఞప్తులు వచ్చాయని, ఈ మేరకు వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పగిడిద్ద రాజు దగ్గరా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. జాతర విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గిరిజన విశ్వ విద్యాలయం సమస్య త్వరలోనే పరిష్కారం కానుందని మంత్రి సత్యవతి తెలిపారు. గట్టమ్మ దగ్గర డిగ్రీ కాలేజీకి రూ.55కోట్ల కేటాయించినట్లు చెప్పారు. త్వరలోనే టెండర్ పనులు మొదలవుతాయని, మనగపేట దగ్గర ఫ్లడ్ బ్యాంక్ పనులు నిధులు విడుదలయ్యాయని, త్వరలోనే పనులు మొదలవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గత జాతరలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రహదారులు బాగుంటే ట్రాఫిక్ సమస్య తీరుతుందని, తిరుగు జాతర ఏర్పాట్లపై కూడా దృష్టి పెట్టి వసతులు కల్పించాలన్నారు. సమీక్షా సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ నాగజ్యోతి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఆర్డీఓ రమాదేవి, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ శంకర్, ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ హేమలత, డీటీడీవో ఎర్రయ్య, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, ఐటీడీఏ ఏపీవో వసంత్ కుమార్, జడ్పీటీసీలు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఈవో రాజేందర్, ప్రధాన పూజారి జగ్గారావు, పూజారులు, నేతలు పాల్గొన్నారు.