రంగారెడ్డి : సీఎం కేసీఆర్ అన్ని కులవృత్తులకు ప్రాధాన్యమిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో పరిధి రావిర్యాల పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత తీయటంతో అవి జలకళ సంతరించుకున్నాయి. గతంలో చేపల కోసం ఆంధ్ర మీద ఆధారపడే వాళ్లం. కానీ నేడు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో మృత్స్య సంపద పెరిగిందన్నారు.
రంగారెడ్డి జిల్లాలో కోటి 60 లక్షల చేప పిల్లలు వదలడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రావిర్యాల పెద్ద చెరువులో ఒక్క రోజే 5 లక్షల చేప పిల్లలు వదులుతున్నామన్నారు. చేపల మార్కెటింగ్‌కు ఔట్ లెట్లు, ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్ వాహనాలను సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.
సరఫరదారుడు తీసుకొచ్చిన చేప పిల్లలను నిశితంగా పరిశీలించి సైజ్, నాణ్యత ప్రభుత్వ నిబంధనల కు అనుగుణంగా ఉన్న చేప పిల్లలను మాత్రమే చెరువుల్లో వదలాలన్నారు. నిబంధనల ప్రకారం లేని చేప పిల్లలను తిరస్కరించాలని మంత్రి సూచించారు.