గ్రేటర్ రాజకీయాల్లో మరోసారి విజనరీ లీడర్ కేటీఆర్ గులాబీ ఫైటర్‌గా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే మహానగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మంత్రి కేటీఆర్ గురువారం నుంచి రోడ్ షో ప్రారంభించనున్నారు. రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనదైన మాటల తూటాలతో ప్రత్యర్థులను ఓడించి, గ్రేటర్ పీఠంపై రెండు సార్లు గులాబీ జెండా ఎగురవేయడంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌దే ముఖ్య భూమిక. అదే విధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్నీ తానై నడిపించి గ్రేటర్లో 14 స్థానాల్లో విజయదుందిభి మోగించారు. ఇప్పుడు మరోమారు బీఆర్ఎస్ సర్కారు హ్యాట్రిక్ విజయంలో కీ రోల్ పోషిస్తూ.. నేటి నుంచి 20వ తేదీ వరకు మంత్రి కేటీఆర్ రోడ్ షో చేపట్టనున్నారు. యువనేత రాకతో ఇటు క్యాడర్లో, అటు అభ్యర్థుల్లో నూతనోత్సాహం కనిపించనున్నది.
Ktr
సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ రాజకీయాలపై మంత్రి కేటీఆర్‌ది చెరగని ముద్ర. ఎన్నికలు ఏదైనా ఆయన మ్యాజిక్ ఫలించాల్సిందే.. తారక మంత్రం పారాల్సిందే.. ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ ముందుకు కదలడం..నగర పార్టీ కార్యకలాపాల్లో అన్నీ తానై వ్యవహరిస్తూ అందరినీ కలుపుకొనిపోతూ క్యాడర్లో ధైర్యాన్ని నూరిపోయడం..నేనున్నానంటూ.. ప్రజలకు భరోసా ఇవ్వడం, గ్రేటర్లో తలపండిన రాజకీయ నేతలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాల కలిగిన నేతగా మంత్రి కేటీఆర్ గుర్తింపు సాధించారు.
మోడ్రన్ లీడర్‌గా పేరు తెచ్చుకుని కేటీఆర్ తన వాగ్ధాటితో అనతికాలంలోనే విశ్వనగర విజన్ నేతగా అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు. అంతేకాదు పార్టీని కానీ తనను కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే..తనదైన శైలిలో పంచ్‌లు వేసి దిమ్మ తిరిగేలా చేస్తారు. చమత్కారాలతో నవ్వులు పూయిస్తారు. సాటి మనిషికి సాయపడి అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మోడ్రన్ లీడరే కాదు.. పురపాలక శాఖ మంత్రిగా అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించి అభివృద్ధిలోనూ తనదైన మార్కును ప్రదర్శించారు.
తొమ్మిదిన్నరేండ్లలో విశ్వ నగర విజన్‌కు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. ప్రాంతాలను, పరిస్థితులకు తగ్గట్టుగా తన అహాభావాలను ప్రదర్శించి.. అందరినీ ఆకట్టుకుంటారు. ఇవన్నీ కలగలుపుతూ ఒంటి చేత్తో గతంలో గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 స్థానాలు, 2018 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 24 నియోజకవర్గాలకు గానూ 14 స్థానాల్లో విజయదుంధుబి మోగించడంలో అన్నీ తానై నడిపించిన యువనేతగా కేటీఆర్ కింగ్‌మేకర్ అయ్యారు. 2020 డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బల్దియా పీఠంపై గులాబీ జెండాను ఎగరవేయడంలో తనదైన మార్కు ప్రదర్శన కనబడింది.
ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ బాధ్యత తీసుకున్నారు. ఈ మేరకు నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు గ్రేటర్లో తొలివిడతగా 11 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాల చొప్పున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొననున్నారు.
కూకట్పల్లి, కుత్బుల్లాపూర్‌లో షెడ్యూల్..
కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావుతో కలిసి మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొంటారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో పర్వత్‌నగర్‌కు చేరుకుని.. అక్కడి నుంచి వివేకానంద నగర్, కుభా మజీద్చౌరస్తా జేకే పాయింట్, హజీ మస్తాన్ చౌరస్తా పంకా, మోతీనగర్, మూసాపేట, ఖైత్లాపూర్ రోడ్, కేపీహెచ్‌బీ 4వ ఫేజ్ మీదుగా టెంపుల్ బస్టాప్, రెమెడీ హాస్పిటల్ రోడ్ మీదుగా కూకట్పల్లి వై జంక్షన్ దాటి బాలానగర్ ఫ్లై ఓవర్ నుంచి శోభన చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. మధ్యలో మంత్రి కేటీఆర్ కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేరుకుంటారు. బీఆర్ఎస్ అభ్యర్థి , ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. ఐడీపీఎల్ చౌరస్తా, షాపుర్నగర్ సాగర్ హోటల్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు.
మంత్రి కేటీఆర్ రోడ్‌షోను విజయవంతం చేయాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్‌లో నిర్వహించే రోడ్‌షోను విజయవంతం చేయాలని కార్పొరేటర్లకు, పార్టీ శ్రేణులకు డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 18న మంత్రి కేటీఆర్ రోడ్‌షో ఉన్న నేపథ్యంలో బుధవారం తుకారాంగేట్ రియో పాయింట్ పరిసర ప్రాంతాలను పద్మారావు గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్‌షో ఏర్పాట్లపై అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్‌తో పాటు నేలతో చర్చించారు.
అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ 18న సికింద్రాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించి.. బీఆర్ఎస్ పార్టీ విజయానికి ప్రచారం చేస్తారన్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని రెండు ప్రదేశాల్లో రోడ్‌షోకు సంబంధించిన సభలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.