హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి చూపి వారి కుటుంబాలకు అండగా నిలువాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెడుతూ వేలాది మంది జీవనోపాధికి గండికొడుతున్నది. ఇదే విషయమై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కార్మికుల జీవనోపాధిని కాపాడాలని, ప్రభుత్వ విద్యాసంస్థలకు అవసరమైన వస్త్ర ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని గత నెల 16న సీఎం రేవంత్‌రెడ్డికి స్వయంగా ఆమె లేఖ రాశారు. వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలోని సుమారు 5వేల మందితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ సహచర మంత్రి రాసిన లేఖను కూడా రేవంత్ సర్కార్ బుట్టదాఖలు చేసింది.
‘మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు’ అన్నట్టుగా వ్యవహరించింది. మంత్రి సురేఖ లేఖలో ప్రభుత్వాన్ని కోరిందేమిటంటే.. మూడు దశాబ్దాలుగా రాష్ట్ర వస్త్రోత్పత్తి రంగానికి వెన్నెముకగా నిలుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాసంస్థలకు కార్పెట్లు, బెడ్ షీట్లు, యూనిఫామ్‌లు చేనేత కార్మికులు సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం పరిధిలోకి తేవడం వల్ల వారి ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఇటీవల కార్మికులు నిర్వహించిన ఆందోళనకు మంత్రి స్వయంగా వెళ్లి, వారి సమస్యలు పరిషరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి దయాపూర్వకంగా ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకొని అధికారులు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో సురేఖ వేడుకున్నారు.
చేనేత కార్మికుల తరఫున మంత్రి సురేఖ ఆరు డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందుపెట్టారు. ‘జీవో నంబర్ 1 ప్రకారం.. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్లను కేవలం ‘టెసో’ ద్వారానే కొనుగోలు చేయాలి. ఏటా జూలై నెలలోనే టెసో సంస్థ కు కార్పెట్లు, బెడ్ షీట్ల సరఫరాకు ముందస్తు ఆర్డర్లు జారీ చేయాలి. దీనివల్ల కార్మికులకు నిరంతర ఉపాధి లభించడమే కాకుండా, పాఠశాలలు ప్రారంభమయ్యే ఏప్రిల్ నాటికే నాణ్యమైన ఉత్పత్తులు సిద్ధమవుతాయి. గత ఏడు నెలలుగా టెసో సంస్థ నుంచి చెల్లింపులు రాక సహకార సంఘాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. థ్రిప్ట్ ఫండ్ పథకంలో ప్రభుత్వ వాటా పెండింగ్ బకాయిలను విడుదల చేయడంతోపాటు గతంలో అమలైన 20శాతం నూలు సబ్సిడీని పునరుద్ధరించాలి. వరంగల్ జిల్లాలో కొత్తగా ‘యార్న్ డిపో’ను ఏర్పాటు చేయాలి’ అని సురేఖ కోరారు.