వేల్పూర్, జూలై 2: బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వరద కాలువ మరమ్మతులు పూర్తికావడంతో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని నింపాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. ఏమైనా చిన్నచిన్న సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించి, ఆయకట్టు గ్రామాల రైతాంగానికి సకాలంలో సాగునీరందించాలని సూచించారు. గురువారం ఆయన ఇరిగేషన్ శాఖ ఈఈ లాల్‌సింగ్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు.
ఇటీవల వరదకాలువ దెబ్బతినగా, మరమ్మతు పనులు పూర్తయ్యాయని, సబ్‌కాంట్రాక్టర్ల మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదంతో పనుల్లో జాప్యం నెలకొన్నట్లు ఇరిగేషన్ ఈఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. దీనిపై స్పందించిన వేముల తక్షణమే ఇరువర్గాల కాంట్రాక్టర్లతో మాట్లాడి ఒకటిరెండు రోజుల్లో వివాదాన్ని పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని, అవసరమైతే తాను కూడా స్వయంగా ప్రధాన కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీనిచ్చారు.
వచ్చే వారం, పది రోజుల్లో రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలువకు నీటిని తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు తక్షణమే నివేదికలు పంపాలని, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఈఈని కోరారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 15.2 టీఎంసీల నీటి నిల్వ ఉన్నదని, బాబ్లీ ప్రాజెక్టు నుంచి 14 గేట్లు ఎత్తి 5.2 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఈఈ లాల్‌సింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి వివరించారు. ఎస్సారెస్పీ నుంచి లేదా కింది నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా గానీ వరదకాలువను పూర్తిగా నింపి, ఈ సీజన్లో రైతులకు ఎలాంటి సాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు వేముల దిశానిర్దేశం చేశారు.