Singotam | కొల్లాపూర్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిధులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరా తీశారు. శుక్రవారం జరిగిన సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయ, ఖర్చులను సీఏను పెట్టుకుని ఎందుకు ఆడిట్ చేయలేదని ఆలయ అధికారులను ప్రశ్నించారు.
ఇండెక్స్ లేకుండా బ్యాలెన్స్ సీటును ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారని ఆలయ అధికారులపై జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాలలో భారీఎత్తున ఆదాయం తగ్గడంపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. రూ.1.15 కోట్ల ఆదాయం సమకూరే ఆలయ అకౌంట్లో కేవలం రూ.8 లక్షలు మాత్రమే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలయానికి బ్రహ్మోత్సవాల టైంలోనే మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తుంటారని భక్తుల ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడికి వెళుతుందని ఆయన ప్రశ్నించారు.
ఆలయ ఆదాయంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లెక్కలు అడగడంతో ఆలయ అధికారులు లెక్కలు చెప్పలేక నీళ్లు నమిలారు. ఆలయ ఆదాయానికి గండి కొడితే చూస్తూ ఊరుకోనని మంత్రి హెచ్చరించారు. తనకు పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.