Jana Nayagan | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) కు మద్రాస్ హైకోర్టు నుంచి షాకింగ్ పరిణామం ఎదురైంది. ఈ సినిమాకు తక్షణం సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి శ్రీవాత్సవ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ‘జన నాయగన్’ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ సర్టిఫికేట్ జారీ ఆలస్యమవడంతో చిత్ర నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ పీ.టి. ఆషా, సెన్సార్ బోర్డు ఆలస్యం చేయడాన్ని తప్పుబడుతూ, చిత్రానికి ‘యూ/ఏ’ సర్టిఫికేట్ మంజూరు చేయాలని శుక్రవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుతో సినిమా విడుదలకు మార్గం సుగమమైందని భావించిన చిత్ర బృందానికి, కొన్ని గంటల్లోనే మరో మలుపు ఎదురైంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వెంటనే హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. సినిమాను సమగ్రంగా రివ్యూ చేసేందుకు తగిన సమయం ఇవ్వకుండానే కోర్టు ఆదేశాలు జారీ చేశారని, ఇది సెన్సార్ ప్రక్రియలో ఉన్న నిబంధనలకు విరుద్ధమని బోర్డు వాదించింది.
ఈ అప్పీల్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.“మీరు మీ ఇష్టానుసారంగా విడుదల తేదీని ప్రకటిస్తే, దానికి తగ్గట్టుగా కోర్టులు, సెన్సార్ బోర్డు నడుచుకోవాలా?” అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.“సెన్సార్ సర్టిఫికేట్ కోసం కొంతకాలం ఓపికగా వేచి చూడవచ్చు కదా? న్యాయస్థానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం సరికాదు” అంటూ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధిస్తూ, తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. దీంతో ‘జన నాయగన్’ విడుదలపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. విజయ్ అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగుతాయా? లేక విడుదల మరింత వాయిదా పడుతుందా? అన్నది ఇప్పుడు కోర్టు తుది తీర్పుపైనే ఆధారపడి ఉంది.