కరీంనగర్: బీజేపీ నాయకులు మోకాళ్ల మీద యాత్ర చేసినా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఆదివారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. బీజేపీ నాయకులు జమ్మికుంటలో పద్మశాలీ సమావేశం పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని మండిపడ్డారు. అసలు బీజేపీకి చేనేత కార్మికులు ఎందుకు ఓటేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఏడేళ్లలో నేత కార్మికులకు బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓటు అడగాలన్నారు. చేనేత కార్మికుల కోసం ఏ ఒక్క పథకమైనా ఆ పార్టీ తెచ్చిందా ? అని ప్రశ్నించారు. నేత కార్మికుల ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీ ఉన్న పథకాలను రద్దు చేసిందని, కానీ టీఆర్ఎస్ కొత్త పథకాలు తెచ్చిందని వివరించారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసి నేతన్నలను మోసం చేసింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. అలాంటి పార్టీకి హుజూరాబాద్‌లో చోటు ఇవ్వొద్దని నేతన్నలను కోరారు.
చేనేత కార్మికుల నోట్లో మట్టికొట్టిన పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు, హ్యాండ్లూమ్ బోర్డును రద్దుచేసిన బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు వచ్చినప్పుడు ఆ స్థానంలో ఏమిస్తారో గల్లా పట్టుకుని అడగాలని నేతన్నలకు సూచించారు. చేనేత కార్మికులు నేసిన ప్రతి వస్త్రాన్ని కొని భద్రతను ఇస్తున్నది ఒక్క టీఆర్ఎస్ సర్కారు మాత్రమేనన్నారు. బీజేపీ నాయకులు ఎన్ని మీటింగులు పెట్టి, ఎంత రెచ్చగొట్టినా అన్ని వర్గాలు, మతాలు టీఆర్ఎస్ వైపే ఉంటాయని తెలిపారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్కు ఎనలేని ప్రజాదరణ లభిస్తున్నదని చెప్పారు. భారీ మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ గెలువబోతున్నడాని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.