ఇల్లందకుంట: సొంత జాగా ఉన్న నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షలు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రజల అభివృద్ధే టీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తరఫున మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్‌కు ఇవి నడమంతరపు ఎన్నికలని అన్నారు. ఈటల రాజేందర్ తన స్వార్థం కోసం రాజీనామా చేస్తే వచ్చిన ఎన్నికలని చెప్పారు. హుజూరాబాద్‌ను జిల్లా చేయాలని ఈటల రాజీనామా చేశారా? లేదా జమ్మికుంటలో మెడికల్ కాలేజీ పెట్టాలని రాజీనామా చేశారా? అనేది ప్రజలకు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఈటల రాజేందర్ అక్రమంగా చాలా సంపాదించుకున్నారని, ఆ డబ్బులతో ఆయన ఎలాగైనా బతుకగలడని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆయన కేవలం తన స్వార్థం కోసం మాత్రమే బీజేపీలో చేరి బరిలో నిలిచారని విమర్శించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఉద్యమంలో పనిచేసిన బిడ్డని, నిరుపేదలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని చెప్పారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపైన బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కాలువలో నీళ్లకోసం రైతులు ఎదురుచూసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. మన నెత్తిమీదనే గంగమ్మ ఉన్నట్లు ఉందని, కాలంతో సంబంధం లేకుండా ఎక్కడైనా నీళ్లే కనిపిస్తున్నాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కట్కా నొక్కితే మీ ఊరి పొలాల దాకా నీళ్లు వస్తున్నమాట నిజం కాదా? అని అడిగారు.
గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలిసేదికాదని, లోవోల్టేజీ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయి పంటలకు నీళ్లు లేక చాలా ఇబ్బంది అయ్యేదన్నారు. కానీ నేడు కన్నుకొట్టినంతసేపు కూడా కరెంట్ పోవడం లేదన్నారు. చేదబావినుంచి చెంబుతో నీళ్లు ముంచుకునే ఎనకటి రోజులు వచ్చాయని, ఇదంతా కేసీఆర్ కృషివల్లే సాధ్యమైన మాట వాస్తవం కాదా? అని అడిగారు. బీజేపీ ప్రభుత్వం బావులకు మీటర్లు పెడతామంటుంటే.. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మీటర్లు పెట్టనివ్వబోనని సీఎం కేసీఆర్ అంటున్నారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేంద్రం పెట్రోలు, డీజిలు ధరలు పెంచడంతో గతంలో పొలం దున్నేందుకు రూ. 2500 అయ్యే ఖర్చు.. ఇప్పుడు ఐదు వేలకు చేరుకుందన్నారు.
పండుగపూట గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయాలు దాటించిన బీజేపీ సర్కారుకు ఎలా ఓటేద్దామని హరీశ్‌రావు ప్రశ్నించారు. పేదల ఉసురుపోసుకుంటున్న బీజేపీలో ఈటల చేరారని, ఆయనను ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిని చేసిన కేసీఆర్‌నే తిడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. మంత్రి పదవిలో ఉండగా హుజూరాబాద్ అభివృద్ధిని పట్టించుకోని ఈటల రాజేందర్.. బీజేపీలో ఉండి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యతకు తనదే భరోసా అని హరీశ్‌రావు పేర్కొన్నారు.