కార్పొరేషన్, నవంబర్ 07: తనకు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత ఉత్సాహంతో అభివృద్ధి పథంలోకి తీసుకపోతానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. మంగళవారం స్థానిక రాజశ్రీ గార్డెన్లో నిర్వహించిన మున్నూరుకాపు సంఘం ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. తనను ఆశీర్వదించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మున్నూరు కాపులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వచ్చేవి కావని, వాటికి వేస్తే ఓటు వృథా అవుతుందని, తనకు ఓటు వేసి గెలిపిస్తే మంత్రి అవుతానని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. అన్ని గ్రామాలకు సాగునీరు తీసుకువచ్చామని, రోడ్లను అభివృద్ధి చేసి జీవన ప్రమాణాలను పెంచామన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు కావాలో ఎన్నికప్పుడే కనిపించి, జైళ్ల చుట్టూ తిరిగే నాయకులు కావాలో ఆలోచన చేయాలని సూచించారు. సమైక్య పాలనలో రోడ్లు లేక ఎంతో ఇబ్బంది పడ్డామని, కాని రాష్ట్రం సాధించుకున్న తర్వాత రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. పచ్చని తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్రలు సాగుతున్నారయని, ఒక్క ఓటు తప్పు జరిగితే తెలంగాణ మళ్లీ అంధకారం అవుతుందన్నారు. అడ్డగోలు హామీలు ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ వస్తున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్కు అండగా నిలిచి కారు గుర్తు ఓటు వేయాలని కోరారు. మీ ఆశీర్వదంతోనే ఈ స్థాయికి ఎదిగానని, ఎప్పటికీ సంఘం మద్దతు మరిచిపోనని పేర్కొన్నారు. సమావేశంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, నాయకులు కర్ర రాజశేఖర్, తోట సత్యనారాయణ పాల్గొన్నారు.