కట్టంగూర్, మే 13 : అన్నదాతలను మిల్లర్లు నిలువునా దోపిడీ చేస్తున్నారు. తాలు పేరుతో ఐదు నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. మండలంలోని మునుకుంట్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 164 మంది రైతులు తమ ధాన్యాన్ని రాసులుగా పోశారు. మిల్లర్ల కొర్రీలతో కొనుగోళ్లు మందకొడిగా జరుగుతుండటంతో రైతులు రాత్రి, పగలు రాసుల వద్దే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీల కొరత కూడా తోడవడంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 45 రోజులు దాటినా ఇప్పటివరకు 22 మంది రైతుల ధాన్యా న్ని కాంటా వేసి 12 లారీల ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు తరలించారు.
క్వింటాకు 5 నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. వారానికి ఒక్క లారీ మాత్రమే రావడంతో ధాన్యం తరలింపు నత్తనడకన సాగుతోంది. రైతులే లారీలు తెచ్చుకుంటే వారి ధాన్యాన్ని మాత్రం కాంటా వేపి మిల్లులకు తరలిస్తున్నారు. లోడింగ్ చేసిన లారీలు మిల్లుల వద్దకు చేరిన తరువాత ఐదు నుంచి ఆరు రోజుల వరకు దిగుమతులు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లర్లు షార్టేజీ పేరుతో మూడున్నర క్వింటాళ్ల వరకు ధాన్యాన్ని కటింగ్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏ మండల స్థాయి అధికారి కూడా కేంద్రాన్ని సందర్శించి తమ సమస్యలు తెలుసుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.