బెంగళూరు, అక్టోబర్ 24: బెంగళూరు ఆధారిత క్రీడా మౌలిక సదుపాయాల కల్పన (స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) స్టార్టప్ మిచెజో స్పోర్ట్స్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే ఇకపై ఆయా రాష్ర్టాల్లో స్విమ్మింగ్ పూల్స్, పబ్లిక్ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే నిధుల సమీకరణకు దిగగా.. వెంచర్ క్యాపిటల్ సంస్థ సెంటర్ కోర్ట్ క్యాపిటల్తోపాటు, జెరోధా అనుబంధ సంస్థ రెయిన్మ్యాటర్ తదితర సంస్థల నుంచి ప్రీ-సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్లో దాదాపు రూ.22 కోట్ల (2.5 మిలియన్ డాలర్లు) నిధులను చేజిక్కించుకున్నట్టు శుక్రవారం కంపెనీ తెలిపింది.
ఈ నిధులతో ఆయా క్రీడా సాధనాలు, ఇతరత్రా సమకూర్చుకొని, తమ పంపిణీ వ్యవస్థీకృత వేదికల్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నట్టు పేర్కొన్నది. అంతేగాక వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్రీడా సదుపాయాలను కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సంస్థ చెప్తున్నది. కాగా, 2019లో మిచెజో స్పోర్ట్స్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా నాణ్యమైన క్రీడా వసతులను నెలకొల్పడానికి కృషి చేస్తున్నది.
ఇప్పటిదాకా పాఠశాలలు, క్లబ్బులు, విశ్వవిద్యాలయాలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇలా 175కుపైగా కస్టమర్లకు 350కిపైగా ప్రాజెక్టులను నిర్మించి ఇచ్చింది. అథ్లెటిక్ ట్రాక్స్, ఫుట్బాల్-హాకీ టర్ఫ్స్, బ్యాడ్మింటన్-స్కాష్ కోర్టులను ఫిఫా, ఎఫ్ఐహెచ్, ఐటీఎఫ్, వరల్డ్ అథ్లెటిక్స్ వంటి అంతర్జాతీయ ఫెడరేషన్స్ ప్రమాణాలకు తగ్గట్టుగా అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో మిచెజో స్పోర్ట్స్ వ్యవస్థాపకుడు, మాజీ టెన్నిస్ ఆటగాడైన మహర్షి శ్రీధర్ తెలిపారు. అయితే ప్రస్తుతం భారతీయ క్రీడా రంగ పరిశ్రమ అవ్యవస్థీకృతంగా ఉందన్న ఆయన.. భారీ పెట్టుబడులతో, ప్రోత్సాహకాలతో గాడినపడగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.