నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, అక్టోబర్ 24: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వరి ధాన్యం తడవగా, పత్తి, మిర్చి పంటలు సైతం నష్టపోయారు. సిద్దిపేట మారెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వారం క్రితం మార్కెట్ యార్డుకు ధాన్యం తెచ్చినా కాంటా వేయకపోవడంతో వర్షానికి తడిసిందని రైతులు వాపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఆరబోసిన ధాన్యమంతా వరదకు కొట్టుకుపోయింది. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు ధాన్యం తడిసినట్టు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా నస్రుల్లాబాద్, బీర్కూర్, నాగిరెడ్డిపేట, లింగంపేట, ధర్పల్లి, మాక్లూర్ తదితర మండలాల్లో రోడ్లు, కల్లాలపై ఆరబెట్టిన వడ్లు వర్షానికి కొట్టుకుపోయాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న వరి నేలవాలపోవడంతోపాటు పలుచోట్ల నీట మునిగింది. పత్తి పైరు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నది. పత్తికాయలు నల్లబడటంతో అపార నష్టం వాటిల్లింది. మిర్చి పైరు నేలవాలింది. ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ధాన్యం తడిసి, మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు దెబ్బతిన్నందున తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.