న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 24: కొండెక్కిన బంగారం ధరలు ప్రస్తుతం కొండదిగుతున్నాయి. గతవారంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి తిరోగమనబాట పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తాజాగా వెల్లడించింది. దేశ రాజధాని నూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,25,600కి దిగొచ్చింది. ఈ నెల 18న రికార్డు స్థాయి రూ.1,32,400 పలికిన ధర ప్రస్తుతం రూ.7 వేల వరకు తగ్గినట్టు అయింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర కూడా రూ.1.25 లక్షలుగా నమోదైంది. గత శనివారం ఇది రూ.1,31,800గా ఉన్నది. ఇటు హైదరాబాద్లో తులం పుత్తడి ధర రూ.1.25 లక్షల దిగువకు పడిపోయింది. 24 క్యారెట్ పదిగ్రాముల ధర రూ.710 తగ్గి రూ.1,24,370గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ ధర కూడా రూ.650 తగ్గి రూ.1.14 లక్షలకు పరిమితమైంది.
బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.20 వేల వరకు దిగొచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రూ.1,52,600కి పరిమితమైంది. గతంలో ఇది రూ.1.70 లక్షలుగా ఉన్నది. దీపావళి పండుగ సందర్భంగా గడిచిన నాలుగు రోజులుగా మూతపడిన బంగారం దుఖాణాలు మళ్లీ శుక్రవారం తెరుచుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,100 డాలర్ల స్థాయిలో కదలాడుతుండగా, వెండి 48.12 డాలర్ల వద్ద ఉన్నది. సమీప భవిష్యత్తులో ఔన్స్ గోల్డ్ ధర 4,000-4,200 డాలర్ల స్థాయిలో కదలాడవచ్చునని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.