హైదరాబాద్, అక్టోబర్ 24: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,437 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. గతేడాది రూ.1,255 కోట్ల లాభంతో పోలిస్తే 14.5 శాతం వృద్ధిని కనబరిచినట్టు కంపెనీ వెల్లడించింది. ఆదాయం రూ.8,016 కోట్ల నుంచి రూ.8,805 కోట్లకు ఎగబాకింది.
బ్రాండెడ్ మార్కెట్లో విక్రయాలు భారీగా పుంజుకోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ వెల్లడించారు. అలాగే యూరప్ నుంచి రూ.1,376 కోట్ల ఆదాయం లభించగా, భారత్ నుంచి రూ.1,578 కోట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి రూ.1,655 కోట్లు సమకూరాయి. మరోవైపు, ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ బిజినెస్ వర్టికల్‌తో రూ.945 కోట్ల ఆదాయం లభించింది.