మెదక్ మున్సిపాలిటీ, మే 8: ప్రజా రవాణాలో భద్రత ముఖ్యమని, అనుమతి లేని వాహనాలలో ప్రజా రవాణా చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో ఆర్టీసీ, రవాణా శాఖ, పోలీసు అధికారులతో కలిసి జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణం ఎంతో విలువైనదని, వారిపై కుటుంబం ఆధారపడి ఉంటుందని, ప్రైవేట్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు భద్రంగా డ్రైవింగ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకుండా ఆర్టీసీ, రవాణా శాఖ, పోలీసు అధికారులు సమిష్టిగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సూచించారు. ఆయా విషయాలపై ప్రైవేట్ వాహన యాజమానులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రైవేట్ వాహన యాజమానులు అనధికారికంగా వాహనాలు నడపకుండా ప్రజా రవాణా చేయకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు, రవాణా శాఖలదేనన్నారు. బస్టాండ్‌కు 500 మీటర్ల దూరం వరకు ప్రైవేట్ వాహనాలలో ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ప్రైవేట్ వాహనాదారులకు తెలుపాలన్నారు. అనుమతి పత్రాలు లేని వాహనాలు ఎక్కువగా తిరిగే రూట్లలో వైట్ ప్లేట్ ఉన్న సొంత వాహన యాజమానులు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికులను వారి వాహనాల్లో ఎక్కించుకోరాదని, పరిమితికు మించి ప్రయాణికులను రవాణా చేస్తున్న అనుమతి లేని వాహనాలను స్వాధీనపర్చుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఆర్టీసీ రిజనల్ మేనేజర్ సుదర్శన్, మెదక్ బస్సు డిపో మేనేజర్ రవిచందర్, జిల్లా రవాణాశాఖాధికారి శ్రీనివాస్‌గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.