– ఇందిరమ్మ ఇళ్ల కోసం కూనంనేనిని కలిసిన ఎస్ఆర్టీ ఏరియా పరిరక్షణ కమిటీ
రుద్రంపూర్, జూన్ 08 : తమ ఇళ్లను కూల్చివేసి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లు గానీ, సింగరేణి సీఎస్ఆర్ నిధుల ద్వారా గానీ ఎలాంటి సహాయం అందలేదని పేర్కొంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సోమవారం రుద్రంపూర్ ఆర్‌సీఓఏ క్లబ్లో ఎస్ఆర్టీఏ ఏరియా పరిరక్షణ కమిటీ సభ్యులు కలిసి తమ సమస్యలను వివరించారు. రుద్రంపూర్ సీపీఐ కార్యదర్శి, ఉప సర్పంచ్ తోటరాజు, సలిగంటి శ్రీనివాస్, గనిగళ్ల వీరస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. నివాసానికి ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు కేటాయించిన స్థలాల అభివృద్ధి కూడా జరగలేదని పేర్కొన్నారు. తామంతా నిరుపేదలమని, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులమని చెబుతూ కనీసం రెండో విడతలోనైనా ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అర్హులైన వారందరికీ మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు రావాల్సి ఉందని, కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగిందని తెలిపారు. వెంటనే సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడి, ఇందిరమ్మ ఇళ్లు రాని వారికి సీఎస్ఆర్ నిధుల ద్వారా సహాయం అందించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. అలాగే ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌తో కూడా చర్చిస్తానని హామీ ఇచ్చారు. లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్న ప్రతి అర్హుడికి తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. దీంతో కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్టీఏ ఏరియా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గూడెల్లి యాకయ్య, వార్డు సభ్యురాలు ధరావత్ నాగమణి,బొజ్జం సంపత్, అప్సర్ ,గుంజపడిగ రాంచందర్,బుడిపూడి రవి, పూదరి గట్టు, జోసఫ్, హరీష్, కరుణ, కంచర్ల దుర్గాప్రసాద్, సమ్మక్క, సుశీల, గడీల చంద్రకళ పాల్గొన్నారు.