* అధికారుల కళ్లుగప్పి నగదు డ్రా చేస్తున్న కొందరు కాంట్రాక్టర్లు
* యోనో (YONO) యాప్ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్లకు కన్నం
* నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు.. చర్యలకు డిమాండ్
రుద్రంపూర్, జూన్ 08 : సింగరేణి సంస్థలో సివిల్ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ల పేరుతో కొందరు కాంట్రాక్టర్లు భారీ మాయాజాలానికి తెరలేపారు. బ్యాంక్ యాప్‌లను ఆసరాగా చేసుకుని నకిలీ డిపాజిట్లతో సంస్థను నిలువునా ముంచేస్తున్నారు. భవిష్యత్‌లో కాంట్రాక్టర్లు ఏవైనా అవకతవకలకు పాల్పడితే రికవరీ చేయాల్సిన సెక్యూరిటీ డిపాజిట్లు.. కేవలం అధికారుల బీరువాల్లో కాగితాల రూపంలోనే మిగులుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనిపిస్తోందని తోటి కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు.
సింగరేణి సంస్థలో సివిల్ పనులు దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా నిర్దేశిత క్లాస్ ఆధారంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎఫ్.డి.ఆర్ (FDR) రూపంలో బ్యాంక్ నుండి పొంది అధికారులకు సమర్పించాలి.
క్లాస్ – 1: రూ.5 లక్షలు
క్లాస్ – 2: రూ.3 లక్షలు
క్లాస్ – 3: రూ.1.5 లక్షలు
క్లాస్ – 4: రూ.75 వేలు
ఈ నగదును సెక్యూరిటీ డిపాజిట్ కింద అధికారులు భద్రపరుస్తారు. అయితే, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చేతికి రాగానే కొందరు కిలాడీ కాంట్రాక్టర్లు తమ బుద్ధిని చూపిస్తున్నారు. ఎస్బీఐ ‘యోనో’ (SBI YONO) యాప్ ద్వారా బ్యాంకులో ఉన్న సదరు ఎఫ్డీఆర్ నగదును వెనక్కి డ్రా చేసేసుకుంటున్నారు. దీంతో సింగరేణి సివిల్ అధికారుల బీరువాల్లో కేవలం ‘జీరో బ్యాలెన్స్’ ఉన్న కాగితాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
గతంలో (ఆగస్టు 7, 2024న) కొత్తగూడెం ఏరియాలో సరిగ్గా ఇలాంటి మోసమే వెలుగుచూసింది. ఒక కాంట్రాక్టర్ యోనో యాప్ ద్వారా ఎఫ్డీఆర్ నగదును విత్ డ్రా చేసుకోగా, తోటి కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. అయినా అధికారుల తీరులో మార్పు రాలేదని తెలుస్తోంది. ఇటీవల కూడా ఓ కాంట్రాక్టర్ ఈ వ్యవహారంపై విజిలెన్స్ జీఎం, ఫైనాన్స్ జీఎం, మరియు డైరెక్టర్ ఆపరేషన్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కాంట్రాక్టర్లకు కొత్త పనులను కేటాయించే సమయంలో ప్రతిసారీ వారి రిజిస్ట్రేషన్ ఎఫ్డీఆర్ సజీవంగా ఉందా? లేదా? అని సరిచూసుకోవాల్సిన కనీస బాధ్యత సివిల్ అధికారులపై ఉంది. కానీ, ఆ దిశగా తనిఖీలు నిర్వహించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల ఈ పర్యవేక్షణా లోపమే అక్రమార్కులకు వరంగా మారింది.
ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి, ప్రస్తుతం సివిల్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లందరి ఎఫ్డీఆర్ స్టేటస్‌లను బ్యాంకు ల ద్వారా ఆన్లైన్లో తనిఖీ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడుతూ సంస్థను తప్పుదోవ పట్టిస్తున్న కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో పాటు, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సింగరేణి కాంట్రాక్టర్లు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సింగరేణి సంస్థలో ఏ చిన్న పొరపాటు లేదా అవినీతి అక్రమాలు జరిగినట్లు సమాచారం వచ్చినా.. క్షణాల్లో వాలిపోయి తనిఖీలు చేపట్టే విజిలెన్స్ (నిఘా) విభాగం, ఈ భారీ ‘ఎఫ్డీఆర్’ స్కామ్‌లో ఎందుకు మౌనంగా ఉందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టుల రిజిస్ట్రేషన్లలో ఇంత పెద్ద మాయాజాలం జరుగుతున్నా, దీనిపై ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినప్పటికీ విజిలెన్స్ అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేంటని తోటి కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై నమస్తే తెలంగాణ సివిల్ జీఎం వెంకటేశ్వరరావును వివరణ కోరగా తమ దృష్టికి ఒక కాంట్రాక్టర్ విషయం వచ్చిందని వారిపైన చర్యలు తీసుకున్నామని. మిగతా ఎఫ్ డి ఆర్ విషయంలో బ్యాంక్ అధికారులకు రాతపూర్వకంగా విచారణ జరిపించాలని, లేఖను పంపించామని తెలిపారు.