ఎవరు చేసిన పాపమే మంజీర?!
ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర ఎవరి కజ్జల బాష్పధారవే! మంజీర;నీవు పారిన దారిలో ఇక్షుదండాలు నీవు జారిన జాడలో అమృతభాండాలు
మంజీర నదిపై మహాకవి దాశరథి చిలికిన పలుకులు ఇవి. ఆ జలసిరి మువ్వల సవ్వడి నేడు మృగ్యమైంది. కర్షకుల కంట బాష్పధారలై కారి.. అడుగింటి పోయినాయి. దశాబ్దాలపాటు భాగ్యనగరి దాహార్తిని తీర్చిన అమృత కలశం.. నేడు ఒట్టి పోయి దిగాలుగా నెర్రెలు వారింది. మెతుకు సీమ గొంతులో పలికిన మంజీర జలనిక్వాణాలు అంతరించాయి. మేతకు వచ్చిన పశువుల గిట్టల చప్పుళ్లు విని ఆ నదీమతల్లి తల్లడిల్లుతున్నది.
మెదక్ అంటే వరి పంటకు ప్రసిద్ధి.. చర్చికి ఫేమస్. అంతకుమించి మంజీర నీళ్లకు కేరాఫ్. నీళ్లంటే అలాంటి ఇలాంటి నీళ్లు కావు. గంగ కన్నా.. ఈ గరుడ గంగ నీళ్లు మహోన్నతమైనవి. ఆ మాటకొస్తే.. మంజీరా జలాలతో గొంతు తడుపుకొన్న దేవుళ్లకు అమృతపానంపై మనసు పోదంటే అతిశయోక్తి కాదు! అంతటి మహత్తు కలిగిన నీళ్లను మెదక్ పట్టణానికి, భాగ్యనగర వాసులకు ప్రసాదించిన దేవేరి మంజీర. ఎందుకో గానీ, ఏ నదీ జలాలకూ లేనంత రుచి మంజీరా నీళ్లకు ఉంటుందన్నది అక్షర సత్యం. రిచ్ మినరల్స్ ఈ నీటి సొంతం. స్వచ్ఛమైన చెరుకు రసంలో తేనె కలిపితే ఎంత కమ్మగా ఉంటుందో… మంజీర నీళ్లు అంత తియ్యగా ఉంటాయి.
మంజీర జలాలకు ఇంతటి మాధుర్యం రావడం వెనుక ప్రచారంలో ఉన్న పౌరాణిక గాథ కారణమేమో! తన తల్లి వినతకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి గరుత్మంతుడు అమరపురి నుంచి అమృతభాండం తీసుకెళ్లిపోతాడు. అలా నింగిలో పయనిస్తున్న తరుణంలో ఆ అమృతభాండం నుంచి ఒక చుక్క.. కింద పారుతున్న మంజీరలో పడిందట! అలా, యుగాల కిందటే మంజీర అమృతమయమైంది. ఈ కథ ఎంతవరకు నిజమో కానీ, మంజీర నీళ్లు రుచి చూడగానే అందరూ అనే మాట ‘అమృతంలా ఉన్నాయి’ అని. కేసీఆర్ పుణ్యాన ఇప్పుడంటే ఊరూరికీ మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలు వస్తున్నాయి కానీ, అంతకుముందు గ్రామాల దాహార్తి వర్ణనాతీతం! అలాంటి రోజుల్లో… ఎక్కడివారైనా మెదక్ పట్టణానికి వస్తే, వెళ్తూ వెళ్తూ రెండు సీసాల్లో మంజీర నీళ్లు పట్టుకొని పోయేది!
అందుకే కదా! భాగ్యనగర వాసులకు గండిపేట నీళ్లున్నా.. సింగూరు నుంచి మంజీరను తరలించాయి అప్పటి ప్రభుత్వాలు. ఈ సందర్భాన్ని వివరిస్తూ వేముగంటి నరసింహాచార్యులు ‘మంజీరా గేయం’లో ఆనాడు కుతుబు సుల్తాను/ నిలిపిన పురము భాగ్యనగరములోన/ వసియించు పౌరులకు/ పంచదారను బోలు/ మంచి నీరొసగెదవు/ ఎంత చల్లని దానవే! నీవు మంజీర!/ ఎంత తీయని దానవే!’ అని శ్లాఘించారు.
అంతటి మంజీరా నేడు తడి లేక ఎడారిని తలపిస్తున్నది. శతాబ్దాలుగా తల్లి గోదావరికి చేదోడు వాదోడుగా పారుతూ… అఖండ గోదావరిలో కలిసిపోయి రుణం తీర్చుకున్నది మంజీర! ఉమ్మడి పాలనలో సద్దుమణిగిన మంజీర నాదాలకు గోదారి గలగలలు జతచేర్చారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఉపనదికి ప్రధాన నదిని ఉపనదిగా మార్చి… గత పాలకుల పాపాల కూపాలను పూడ్చారు. అప్పుడు మంజీర ఎంతగా పొంగి ప్రవహించిందో. ఇక తన నాదాలు ఎన్నడూ ఆగవని బిరబిరా పరుగులు తీసింది. కానీ, కాంగ్రెస్ తెచ్చిన కరువు.. మంజీరకు అశనిపాతమే అయింది. కాళేశ్వరాన్ని తృణీకరించిన ఫలితం.. తెలంగాణ అంతటా కరువు తాండవిస్తున్నది.
అధికారంలో లేకున్నా.. కరువును రూపుమాపిన ఘనత కేసీఆర్ ఖాతాలో పడుతుందన్న దుగ్ధతో కన్నెపల్లి దగ్గర కట్క ఆన్ చెయ్యడానికి కాంగ్రెస్‌కు చేతులు రాలేదు. ఫలితం.. రాష్ట్రమంతటా కరువు తిష్టవేసింది. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వమనే సోయి ఉండి ఉంటే.. ఈ ఆపత్కాలంలో కాళేశ్వరం అక్షయపాత్ర పాత్ర పోషించేది కదా! నీళ్లు ఎత్తి పోసి ఉంటే.. కొండపోచమ్మ నిండు కుండలా తొణికిసలాడేది కదా! ఆ గోదావరి జలాలు చేరి మంజీరా ముచ్చటగా పారేది కదా!
ఎల్ నినో బూచి చూపి.. కాంగ్రెస్ చేస్తున్న వంచన ప్రజలకు శాపంగా పరిణమించింది. ఈ పాలకుల దుర్నీతి చూసి గోదావరి కంటతడి పెట్టుకొని మరింత ఉధృతిగా కిందికి ప్రవహిస్తున్నది. తనకు అదనపు రుచిని అందించిన సోదరి మంజీర గొంతు తడపలేకపోతున్నాననే రందితో కదిలిపోతున్నది. అందుకే, ఏడుపాయల వనదుర్గ పాద రజాన్ని కడిగేంతగా ఉప్పొంగే మంజీర ఇలా ఎండిపోయింది. చిట్కుల చాముండికి స్తోత్రాలు చేసే మంజీరా నాదాలు జీరబోయాయి. మంజీర గత ప్రవాహానికి ముగ్ధుడైన దాశరథి ఇలా ప్రస్తుతించారు.
ఎవ్వరే యెదురొచ్చి ఏడుపాయలు చేసి రవ్వల్ల వీణపై రాగమొత్తిరి నిన్ను? ఏడుపాయల దుర్గ యేమన్నదే నిన్ను? యేమన్నదే నిన్ను యేడుపాయల దుర్గ? ఏడుపాయల దుర్గ ఎదురుగా వచ్చింది పాడుకొమ్మన్నాది పరుగులిడమన్నాది స్వరమొక్క పాయగా సాగిపొమ్మన్నాది బంగారు పండించి ప్రజలకిమ్మన్నాది
అవును.. స్వరమొక్క పాయగా ఏడు పాయలుగా విడివడి వడివడిగా సాగుతూ… లయబద్ధంగా సాగిపోయింది మంజీర. ఈ అమృతవాహిని నేటి దుస్థితిని అదే దాశరథి చూసి ఉంటే ‘ఎవరు చేసిన పాపమే మంజీర.. నీకు ఎందుకీ శాపమే’ అని రుద్రవీణ మీటేవారు, అగ్నిధారలు కురిపించేవారు. ‘పాలకులు దార్శనికులు అయితే.. అంతర్వాహిని నుంచి కూడా అనంత జలసిరి పుట్టిస్తారు. కానీ, ప్రభుత్వాధినేతలు ముందుచూపు లేనివారైతే… అఖండ జలసిరి కూడా అంతరించి పోతుంది’ అని బదులిచ్చేదేమో ఈ మహానది! అంతేకాదు, నిన్నటి తన వైభవాన్ని కాంగ్రెస్సే కాటేసిందని మౌనంగా జవాబిచ్చేది!
ఉపనదికి ప్రధాన నదిని ఉపనదిగా మార్చి… గత పాలకుల పాపాల కూపాలను పూడ్చారు. అప్పుడు మంజీర ఎంతగా పొంగి ప్రవహించిందో. ఇక తన నాదాలు ఎన్నడూ ఆగవని బిరబిరా పరుగులు తీసింది. కానీ, కాంగ్రెస్ తెచ్చిన కరువు.. మంజీరకు అశనిపాతమే అయింది. కాళేశ్వరాన్ని తృణీకరించిన ఫలితం.. తెలంగాణ అంతటా కరువు తాండవిస్తున్నది.
త్రిగుళ్ల నాగరాజు
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

