ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 23 : ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతు పలికేందుకు వెళ్తున్న మంచిరెడ్డిని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజుతోపాటు సీఐలు మహేందర్‌రెడ్డి, మధు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంచిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరినవారిని ఎక్కడికక్కడే నిర్బంధిస్తున్నారని తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తమతోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తమను ప్రశ్నించకుండా గొంతు నొక్కడం వంటి కార్యక్రమాలకు పాల్పడటం సరైంది కాదన్నారు. నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని.. దమ్ముంటే ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలపాలని ఆర్టీసీ కార్మికులు తమ వద్దకు వచ్చి వినతిపత్రం కూడా అందించారని, వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం పెట్టి ఆర్టీసీకి రావాల్సిన డబ్బులు ప్రభుత్వం నెలనెలా అందజేస్తుందని చెప్పి అందించడం లేదన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేయటం సరైంది కాదన్నారు. ఎవరైనా బంధువులు చనిపోయినా కూడా ఫొటోలతో కూడిన ఆధారాలు చూపిస్తేనే లీవ్ సాంక్షన్ చేయడం సిగ్గుచేటన్నారు.
వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సరైన న్యాయం చేయాలని కోరారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోలనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు రాజు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జగదీశ్వర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు.