రుద్రంపూర్, ఏప్రిల్ 23: పాత కొత్తగూడెం తెలంగాణ పాఠశాల సమీపంలోని ఒక ఇంట్లో నుంచి ఐదడుగుల పొడవైన త్రాచు పామును స్నేక్ రెస్క్యూ టీమ్ పట్టుకుంది. 12వ డివిజన్ స్వచ్ ట్రాలీ డ్రైవర్ చెల్ల రాము ఇంట్లోకి బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఓ పెద్ద త్రాచు పాము ప్రవేశించింది.
సమాచారం అందుకున్న వెంటనే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ ఈ. సంతోష్ బాబు, సభ్యులు ఎన్. శ్రీకాంత్ (చోటు), తుమ్మ శ్రీకాంత్‌లతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఇంట్లో దాగి ఉన్న సుమారు 5 అడుగుల పొడవైన నాజా నాజా (ఇండియన్ స్పెక్టకిల్డ్ కోబ్రా)ను జాగ్రత్తగా పట్టుకుని సురక్షితంగా బంధించారు. అయితే.. తెల్లవారేసరికి బంధించిన డబ్బాలోనే పాము 18 గుడ్లు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గుడ్లు పెట్టేందుకు అనువైన ప్రదేశం కోసం ఆ పాము ఇంట్లోకి వచ్చినట్లు రెస్క్యూ సభ్యులు తెలిపారు. గమనించకపోయి ఉంటే ఇంట్లోని ఏదైనా రహస్య ప్రదేశంలో గుడ్లు పెట్టే అవకాశముండేదని వారు చెప్పారు. స్నేక్ రెస్క్యూ బృందం గురువారం ఉదయం కోబ్రా, దాని గుడ్లను అడవిలోని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టింది.

ఈ సందర్భంగా సంతోష్ బాబు మాట్లాడుతూ తాచు పాములు సాధారణంగా 10 నుండి 50 వరకు గుడ్లు పెడతాయని తెలిపారు. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి 50 నుండి 70 రోజుల్లో గుడ్లు పగిలి పిల్లలు బయటకు వస్తాయని.. అప్పటి వరకూ తల్లి పాము గుడ్లకు కాపలా కాస్తూ, చాలా సందర్భాల్లో ఆహారం కూడా తీసుకోదని వివరించారు. వేసవి కాలంలో చల్లదనం కోసం పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశముందని, రాత్రి సమయంలో వెలుతురు ఉండేలా చూడాలని, నేలపై పడుకోవడం మానుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. కోబ్రాను సురక్షింతగా, బంధించి.. అడవిలో వదిలిపెట్టడంలో ప్రాణధార ట్రస్ట్ సభ్యులు ఎన్. శ్రీకాంత్ (చోటు), తుమ్మ శ్రీకాంత్, అలాగే సంతోష్ కుమారుడు చేతన్ పాల్గొన్నారు.