MLC Sripal Reddy : సింగరేణి పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు పన్నెండు నెలల వేతనాలు అందించాలని సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సీఆర్టీలు పది నెలల వేతనాలు మాత్రమే పొందుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారి సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలపై సీఎండీ బుద్ద ప్రకాశ్ జ్యోతి సానుకూలంగా స్పందించి.. వెంటనే వారిని తిరిగి విధులలో చేరే విధంగా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారని శ్రీపాల్ రెడ్డి అన్నారు.
అలానే కాంట్రాక్టు టీచర్లకు కనీస వేతనం చెల్లింపుపై కూడా సీఎండీ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు. సింగరేణి ఆసుపత్రులతో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో వారికి ఉచిత వైద్యం అందించాలని కోరినట్టు శ్రీపాల్ రెడ్డి వెల్లడించారు. సింగరేణి సీఎండీని కలిసిన వారిలో పీఆర్టీయూ ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఉన్నారు.