HomeNewsMamata Banerjee Targets Centre Over Amphan Cyclone
ప్రజలను గాలికొదిలి బేరసారాలకే కాషాయ నేతల నగదు పంపిణీ : మమతా బెనర్జీ
న్యూఢిల్లీ : ఆంఫన్ తుపాన్ విధ్వంసంతో తీవ్రంగా ప్రభావితమైన బెంగాల్‌కు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తగినంత సాయం చేయలేదని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎమ్మెల్యేల బేరసారాలకే కాషాయ పార్టీ నగదు పంపిణీ చేస్తుందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అమ్లసులిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి దీదీ ప్రసంగించారు. సూపర్ సైక్లోన్ రాష్ట్రాన్ని కుదిపేసిన అనంతరం తమ ప్రభుత్వం వేలాది కోట్లు వెచ్చించిందని గుర్తుచేశారు.
ప్రజలు తమకు అల్లర్లు అవసరం లేదని కాషాయపార్టీకి ఓట్లు వేయకుండా బుద్ధిచెప్పాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. తాను పులినని కేవలం ప్రజల ముందే తలవంచుతానని ఎవరికీ బెదరనని స్పష్టం చేశారు. తాను ప్రజలతో కలిసి పోరాడతానని, ప్రజల గళం వినిపిస్తానని బీజేపీకి తెలుసునని వ్యాఖ్యానించారు. నందిగ్రాం ఘటనలో ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ముందుగా బీజేపీ నేతలనేనని అన్నారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ అంశాలపై బీజేపీని తప్పుపట్టారు. ఈ కార్డుల్లో ఏ ఒక్కటీ లేకున్నా వారిని బీజేపీ ఇబ్బందులు పెడుతుందని చెప్పారు.