బోధన్, ఫిబ్రవరి 14: బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నదని భావించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేని కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్ మద్దతు కోసం వెంపర్లాడుతుండగా, ఆ పార్టీ ఝలక్ ఇచ్చింది. చైర్మన్ ఎన్నికలో తాము కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేదిలేదని మజ్లిస్ కౌన్సిలర్లు స్పష్టంచేశారు. ఆ పార్టీ అధిష్టానం కూడా ఇదే నిర్ణయంతో ఉన్నట్లు స్పష్టం కావడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, మజ్లిస్ చెట్టాపట్టాలేసుకోగా, బోధన్‌లో మాత్రం అధికార పార్టీకి దూరంగా ఉండడం ఆసక్తికర పరిణామంగా మారింది. నిన్నటివరకు తమకు ఆపదలో ఎంఐఎం ఆదుకుంటుందని భావించిన బోధన్ కాంగ్రెస్ వర్గాలు, ఈ సరికొత్త పరిణామంతో విస్తుపోతున్నాయి. పట్టణంలో మొత్తం 38 వార్డులు ఉండగా, ఇందులో 17 వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 20 కాగా, ఆ ఫిగర్‌ను చేరుకునేందుకు కాంగ్రెస్ నాయకులు నానా పాట్లు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సుదర్శన్‌రెడ్డి బోధన్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఆయన కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీని తీసుకురాలేకపోయారు. దీంతో హంగ్ ఏర్పతుందని భావించారు. కాంగ్రెస్‌కు 17 మంది కౌన్సిలర్లకుతోడు ఎక్స్ఆఫీసియో మెంబర్‌గా ఉన్న ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి ఓటు ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం 12, బీఆర్ఎస్ 5, బీజేపీ మూడు వార్డుల్లో గెలిపొందాయి. ఎక్స్ఆఫీసియో మెంబర్ ఓటును కూడా కలుపుకున్నా మున్సిపల్ పీఠం దక్కించుకోవాలంటే కనీసం మరో ఇద్దరు కౌన్సిలర్ల మద్దతు అవసరం. మజ్లిస్‌కు చెందిన 12 మంది కౌన్సిలర్లు స్నేహపూర్వక ఒప్పందం ప్రకారం మద్దతు ఇస్తే చైర్మన్ పదవిని కాంగ్రెస్ సులువుగా దక్కించుకునేది.
రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్‌తో మజ్లిస్ అంటకాగుతుండగా.. బోధన్‌లో ఆ పార్టీ కాంగ్రెస్‌కు దూరమవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా భావిస్తున్న ఓ వ్యక్తితో అదే పదవిని ఆశించి కౌన్సిలర్‌గా గెలిచిన ఎంఐఎం నాయకుడికి ఏర్పడిన శత్రుత్వ వైఖరే ఇందుకు కారణమని సమాచారం. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని మార్చి ముందుకువెళ్లే పరిస్థితి కాంగ్రెస్‌లో కనిపించడంలేదు. ఇటీవల బోధన్‌కు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తామే అధికారంలోకి వస్తామని, కాంగ్రెస్‌కు తమ తడాఖా ఏమిటో చూపిస్తామని చేసిన వ్యాఖ్యలు పట్టణవాసులు గుర్తుచేసుకుంటున్నారు.
ఇతర పార్టీల కౌన్సిలర్లపై గురి
మజ్లిస్ పార్టీ ఇచ్చిన ఝలక్‌తో మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు ఇతర పార్టీలకు చెందిన మరో ఇద్దరు కౌన్సిలర్లకు ఎర వేసింది. ప్రలోభాలకు గురిచేసి తమ శిబిరంలో చేర్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గెలుపొందిన కాంగ్రె స్ కౌన్సిలర్లను ఇప్పటికే శిబిరానికి తరలించారు. హైదరాబాద్‌కు శుక్రవారం రాత్రికి చేరుకున్నారు. 16వ వార్డు నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి దివ్యను కూడా కాంగ్రెస్ నాయకులు తమ శిబిరానికి తీసుకెళ్లడం గమనార్హం.
నిజామాబాద్‌లో అలా.. బోధన్‌లో ఇలా..
నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడగా, అక్కడ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌కు మజ్లిస్ దూరంగా ఉంది. నిజామాబాద్ మున్సిపల్ రాజకీయాలు బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నందున, బోధన్ మున్సిపాలిటీలో తమ పార్టీకి చైర్మన్ పదవి ఇవ్వాలని మజ్లిస్ నాయకులు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.