సూర్యాపేట, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)/జహీరాబాద్ : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో మెంబర్‌గా దరఖాస్తు చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అధికారులు ఘోరంగా అవమానించారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు వారి దరఖాస్తులను స్వీకరించేందుకు సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లో అధికారులు నిరాకరించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 10 బీఆర్ఎస్, 5 స్థానాలు కాంగ్రెస్‌కు రావడంతో బీఆర్ఎస్కు చైర్మన్ స్థానం ఖాయమైంది. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఎలాంటి అడ్డదారి తొక్కుతారోననే అనుమానంతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా దరఖాస్తు చేసేందుకు తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
వాస్తవానికి ఐదు నిమిషాల్లో తతంగం పూర్తి కావాల్సి ఉండగా ఒక ఎమ్మెల్సీ అనే కనీస గౌరవం ఇవ్వకుండా కమిషనర్ ఫోన్ మాట్లాడటం, ఇతరులతో మాట్లాడుతూ సాయంత్రం ఐదుగంటల వరకు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కార్యాలయ పనివేళలు ముగిసే వరకు కూర్చోబెట్టి, ఆ తరువాత అవకాశం లేదంటూ కమిషనర్ సెలవిచ్చారు. దీంతో ఎమ్మెల్సీతోపాటు బీఆర్ఎస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఈ నెల 13న ఒక సర్క్యులర్ వచ్చిందని, దాని ప్రకారం ఏ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి ఎమ్మెల్సీ అవుతారో అదే నియోజకవర్గంలో ఎక్స్అఫీషియోగా దరఖాస్తుకు అవకాశం ఉన్నదని కమిషనర్ చెప్పడంతో ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్క్యులర్ చదివి చెప్పేందుకు ఐదు నిమిషాల సమయం పడుతుందని, అయితే ఐదు గంటలపాటు ఎందుకు కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేశారని నిలదీశారు. కమిషనర్ తీరును నిరసిస్తూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఎక్స్అఫీషియోగా రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ సభ్యత్వ నమోదు ప్రక్రియలోనూ గందరగోళం చోటుచేసుకున్నది. శనివారం సంబంధిత సభ్యత్వ నమోదు పత్రాలను స్వీకరించేందుకు జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి సభ్యత్వ నమోదు కోసం మొదట కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి నుంచి సభ్యత్వ నమోదు పత్రాలను తీసుకుని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సాయంత్రం 4 గంటలకు జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
సదరు పత్రాలను అందజేసేందుకు కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఫోన్లో సంప్రదించారు. సభ్యత్వ నమోదు కాపీలను ఆర్డీవోకు ఇవ్వాలని కమిషనర్ సూచించారు. అక్కడి నుంచి ఆర్డీవో వద్దకు వెళ్లగా, మున్సిపల్ కమిషనర్‌కు ఇవ్వాలని సూచించారు. ఒకరిపై ఒకరు తాను బాధ్యుడిని కాదంటే తాను కాదంటూ రాత్రి 8గంటలైనా పత్రాలను తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ నేతల ఒత్తిడికి తలొగ్గి అధికారులు ఉద్దేశపూర్వకంగానే దరఖాస్తులు తీసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సభ్యత నమోదు పత్రాలను తీసుకునే వరకు మున్సిపల్ కార్యాలయం నుంచి కదిలేది లేదంటూ బీఆర్ఎస్ నేతలు అక్కడే బైఠాయించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు జిల్లా, రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మున్సిపల్ అధికారులు సభ్యత్వ నమోదు పత్రాలను తీసుకున్నారు.