KTR | దేశంలోని ప్రస్తుత పరిస్థితుల పట్ల జెన్‌జీ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో 25 రోజులుగా ఏ పార్టీ, ఏ జెండా లేకుండా పోరాటం చేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా యువత కదం తొక్కుతున్నారని పేర్కొన్నారు. యువత జంతర్‌మంతర్ దగ్గరకు వెళ్లి ఆందోళనలో పాల్గొంటున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. యువత కోసం మనం మాట్లాడాలని నిర్ణయించుకున్నామని తె లిపారు. యువత న్యాయమైన పోరాటానికి మద్దతుగా ఈ సభ పెట్టామని చెప్పారు.
ప్రజా ఉద్యమంలో పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ తెలిపారు. ప్రజలను సమీకరించి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. యువతకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చిందని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనలు చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు. పిల్లలను కుళ్లబొడుస్తున్నారని తెలిపారు.
యువత మోదీ, అమిత్ షా కుర్చీని అడగడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారని చెప్పారు. గాంధేయ మార్గంలో సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేపట్టారని అన్నారు. యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారని తెలిపారు. వాంగ్ చుక్ నిరాహార దీక్షను ఒక్క మీడియా కూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, కేసులకు భయపడి మీడియా ముందుకు రాలేదని అన్నారు. మీడియా ముందుకు రాలేదు కానీ సోషల్‌మీడియా మాకు అండగా ఉందని జెన్‌జీ ముందకొచ్చిందని తెలిపారు.
మోదీ పెట్టుకోకూడని వాళ్లతో పెట్టుకున్నావ్.. జాగ్రత్త అని కేటీఆర్ హెచ్చరించారు. రాజ్యమా ఉలికిపడు.. అంటూ యువత ముందుకొచ్చారని తెలిపారు. యువత పోరాడుతుంటే.. ఖలీస్తాన్, పాకిస్తాన్ అంటున్నారని మండిపడ్డారు. ఈ జనరేషన్ చావుకు భయపడే జనరేషన్ కాదని స్పష్టం చేశారు. ఈడీ, మోదీకి భయపడే జనరేషన్ కాదని అన్నారు. యువత ఆకలితో ఉంది.. మెట్టు మెట్టు ఎక్కుతారని తెలిపారు. 12 ఏళ్లుగా మతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదికి 12 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదని అన్నారు. మేక్ ఇన్ ఇండియా అడిగితే.. లీక్ ఇన్ ఇండియా ఇచ్చారని మండిపడ్డారు. మేం న్యాయం అడిగితే రాజ్యం హింసకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.