హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కన్నా ప్రైవేట్ హెల్త్ పాలసీలే మిన్న! ఈ పథకం కోసం 1.5 శాతం వాటా మేం ఎందుకివ్వాలి? మా వాటా ఉన్నప్పుడు ఉచితమెట్లవుతుంది? ట్రస్టు ఏర్పాటు చేయడం, డబ్బులు జమచేయడం.. దవాఖానలు క్లెయిమ్ చేసుకొనే విధానం సక్రమంగా అమలయ్యేనా? మేము దాచుకున్న డబ్బులు మాకివ్వనోళ్లు హెల్త్‌స్కీమ్ ప్రీమియం పైసలిస్తరా? బిల్లులు చెల్లిస్తారా? అంటూ ఉద్యోగ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్ తాజాగా అమల్లోకి తెచ్చిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)పై ఆ వర్గాల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈహెచ్ఎస్ స్కీమ్‌పై గురువారం (ఈ నెల 12న) ఉద్యోగ సంఘాల నేతలతో సర్కార్ కీలక సమావేశాన్ని నిర్వహించింది. కొన్ని విధివిధానాలను ఖరారు చేసింది.
ఈ పథకం అమలు కోసం ప్రతినెలా ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5 శాతం కోత పెడతారు. సర్కార్ కూడా అంతే మొత్తాన్ని కాంట్రిబ్యూషన్‌గా సమకూరుస్తుంది. ఈ మొత్తం అంతా ఈహెచ్ఎస్ ట్రస్టులో జమవుతుంది. ఈ ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు జారీచేసి, ట్రస్టులో జమ అయిన మొత్తం నుంచి చికిత్స పొందిన దవాఖానలకు బిల్లులు చెల్తిస్తారు. ఈ పథకంపై ఉద్యోగుల్లో అనేక సందేహాలు, అపోహలు ఉన్నాయి. త్వరలో తీసుకొచ్చే రాష్ట్ర బడ్జెట్లో ఈ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం మార్గదర్శకాలు కూడా త్వరలో ఖరారు కానున్నాయి. ఈ దశలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఉద్యోగ వర్గాల అపోహలు
ఉద్యోగసంఘాల నేతలపై ఫైర్
ఈహెచ్ఎస్ పథకంలో ఉద్యోగుల వాటా 1.5 శాతంపై ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించడంపై సాధారణ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇంత మొత్తానికి ఎందుకు అంగీకరించారు? అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో సంఘాల నేతలకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే ఫోన్లు చేసి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికల్లో అక్షింతలేస్తున్నారు. ఉద్యోగుల వాటా ఎంత? అన్న అంశంపై గతంలో అనేక చర్చలు జరిగాయి. తొలుత ప్రతినెలా రూ.500 ఉద్యోగుల వాటాగా చెల్లించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత చర్చల్లో ప్రతినెలా రూ.1,000కి పెంచారు.
కానీ గురువారం ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో 1.5 శాతం వాటాకు నేతలు అంగీకరించారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా పర్సంటేజీ వద్దు.. నెలకు రూ.1,000 సరిపోతుందని సర్కార్‌కు చెప్పినా ఫలితం దక్కలేదని తెలుస్తున్నది. మొత్తంగా 1.5శాతం వాటాకు అంగీకారం కుదిరింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని నమ్మితే నట్టేట మునిగినట్టే.. అంటూ ఉద్యోగుల్లో చర్చలు నడుస్తున్నాయి.