హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ) : వరంగల్ జిల్లాకు చెందిన రాజేశం గతంలో టీ-ఐడియా పథకం కింద పిండి మర ఏర్పాటుచేసుకొని ప్రభుత్వం ద్వారా రూ.70వేల వరకూ సబ్సిడీ పొందాడు. నల్లగొండ జిల్లావాసి వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వ పీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం(పీఎంఈజీపీ) కింద అగరుబత్తీలు, కొవ్వొత్తుల తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నుంచి సుమారు రూ.50వేల వరకూ లబ్ధిపొందాడు. వాస్తవానికి వీరిరువురూ నిరుపేదలే. సొంతంగా ఇల్లు కట్టుకునే స్థోమత ఇద్దరికీ లేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం వీరికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని రద్దు చేసింది. వీరు ఇప్పటికే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అర్హులు కారని అధికారులు తేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఉదాహరణలు 20వేలకు పైగా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించిన అధికారులు, వారికి బిల్లుల చెల్లింపు నిలిపివేయగా, మరోవైపు కేంద్రం వీరికి మంజూరైన ఇండ్లను రద్దు చేసింది.
రాష్ట్ర సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అనుబంధంగా అమలుచేస్తున్నది. ఒక్కో ఇంటికి రాష్ట్రం రూ.5లక్షలు ఇస్తుండగా, అందులో కేంద్రం నుంచి రూ.1.5లక్షల వరకు సహాయం అందుతున్నది. అయితే, అనర్హులను ఏరివేసేందుకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌లో లబ్ధిదారుడి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేస్తే అతనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతున్నాయి. అంతేకాదు, మానవ ప్రమేయం లేకుండా సదరు యాపే రెడ్ సింబల్ ద్వారా అనర్హులను సూచిస్తుంది. రాష్ట్రం మాత్రం క్షేత్రస్థాయి సర్వే ద్వారా జాబితాను రూపొందించి మంజూరు చేసింది. సర్వే సమయంలో వారి ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలు, గతంలో వారు ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధిపొందారా? లేదా? అనే వివరాలను పరిశీలించకపోవడం ఇప్పుడు కొత్త తలనొప్పులకు కారణమైంది. కేంద్రం అనర్హులను గుర్తించి వారి పేర్లను తిరస్కరిస్తున్నది. కేంద్రం తమ ఇండ్లను రద్దు చేయడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కేంద్రం రద్దు చేసిన లబ్ధిదారులకు ఒకవేళ రాష్ట్ర సర్కార్ ఇండ్లు ఇవ్వాలనుకుంటే పూర్తిగా రూ.5లక్షలు రాష్ట్ర ఖజానా నుంచే చెల్లించాల్సి ఉంటుంది.
కుటుంబ సభ్యులు లబ్ధిపొందినా ఇల్లు రానట్టే
ఇండ్లు రద్దయిన లబ్ధిదారుల్లో వివిధ పథకాల కింద సూక్ష్మ, లఘు వ్యాపారాలు చేస్తున్నవారు, దళితబంధు స్కీమ్ ద్వారా వాహనాలు, ఇతర సహాయం పొందినవారు, గతంలో ఇల్లు పొందిన వారి కుటుంబ సభ్యులు అధికంగా ఉన్నారు. వీరుకాకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు, భారీగా భూములు, పక్కా ఇండ్లు ఉన్నవారూ ఉండడం గమనార్హం. ఇదిలావుంటే, రాష్ట్రంలోని నిరుపేదలకు 20లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, మొదటి విడతలో మంజూరుచేసిన 4.5లక్షల ఇండ్లలో చాలామంది అనర్హులను ఎంపిక చేసింది. ముందూ వెనుక ఆలోచించకుండా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసుల ఆధారంగా చాలామంది అనర్హులకు మంజూరు చేసింది. పీఎంఏవై స్కీమ్ కింద లబ్ధి పొందాలంటే 100గజాల లోపు స్థలంలో కచ్చా ఇల్లు ఉన్నవారు, ప్రభుత్వం నుంచి గతంలో ఎప్పుడూ, ఎలాంటి లబ్ధి పొందనివారు, దినసరి కూలీలు తదితర వర్గాలు అయి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవేవీ పరిశీలించకుండా, అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి లబ్ధిదారులను ఎంపికచేయడంతో ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర సర్కార్ మెడకు చుట్టుకున్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వమే సొంతంగా వారికి రూ.5లక్షల చెల్లిస్తుందా? లేక చేతులెత్తేస్తుందా? వేచిచూడాల్సిందే.
‘కొంప’ముంచిన సర్కార్ తీరు
ఇండ్ల మంజూరు విషయంలో రేవంత్ సర్కార్ తీరు లబ్ధిదారులను అయోమయంలో పడేసింది. నిరుపేదలకు 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల సమయంలో ఆర్భాటంగా హామీలు గుప్పించిన కాంగ్రెస్.. పకడ్బందీగా లబ్ధిదారుల సర్వే చేయకుండా అనాలోచితంగా వ్యవహరించి 20వేల ఇండ్ల రద్దుకు కారణమైంది. కేంద్రం వాటిని తిరస్కరించిన నేపథ్యంలో రాష్ట్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉండగా, పీఎంఏవై నిబంధనలను సాకుగా చూపుతూ తప్పించుకోవాలని చూస్తున్నది. ఫలితంగా ఇక సొంతింటి కల నెరవేరిందని సంబురపడ్డ లబ్ధిదారులకు ఆ సంతోషం లేకుండా చేసింది. కేంద్రం రద్దు చేసినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతగా తమకు ఇండ్లు ఇప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.