Hyderabad | హైదరాబాద్ గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ముందు పనిమనిషి శ్రావణి ఆత్మహత్యకు యత్నించిన కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. దొంగతనం చేసి దొరికిపోతాననే ఉద్దేశ్యంతోనే శ్రావణి సూసైడ్ డ్రామా ఆడినట్లుగా పోలీసులు గుర్తించారు.
కవాడిగూడకు చెందిన వేముల శ్రావణి ఓ అపార్ట్మెంట్లో ఐదేళ్లుగా పనిచేస్తోంది. ఆ అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో హౌస్ కీపింగ్ చేస్తూ ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా డైమండ్ రింగ్, బంగారు గొలుసు సహా 3.5 తులాల బంగారాన్ని దొంగిలించింది. మరో ఫ్లాట్లో 4.25 తులాల మంగళసూత్రం ఎత్తుకెళ్లింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పనిమనిషి శ్రావణిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు.
ఈ క్రమంలో దొరికిపోతాననే భయంతో శ్రావణి ఆత్మహత్య డ్రామాకు తెరలేపింది. నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లుగా నటించింది. అది కాస్త సంచలనంగా మారడంతో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించారు. దీనిపై సవివరమైన నివేదిక సమర్పించాలని పోలీసులకు సూచించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రావణి, ఆమె భర్త చంద్రకాంత్పై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాలతో విచారించగా శ్రావణి దంపతులే దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. దోమలగూడలోని ఓ బంగారు దుకాణంలో దశలవారీగా బంగారం విక్రయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దంపతులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని 7 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నేరాన్ని అంగీకరించడంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు.
Read Also : Hyderabad | బ్లౌజ్ సరిగ్గా కుట్టలేదని రూ.లక్ష జరిమానా.. హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ తీర్పు