Hyderabad | తన సోదరుడి పెళ్లికి బ్లౌజ్ కుట్టమని ఓ మహిళ చీర ఇస్తే.. అడ్డదిడ్డంగా కత్తిరించిన ఓ కంపెనీకి భారీ జరిమానా పడింది. దీన్ని సేవాలోపంతో పాటు అనైతిక వ్యాపారంగా నిర్దారించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ 1 రూ.లక్ష పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే బాధితురాలి కేసు ఖర్చులను కూడా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌కు చెందిన కె.అమృతవర్షిణి సోదరుడికి కొద్దిరోజుల కిందట పెళ్లి నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో బహుమతిగా వచ్చిన ఆడపడచు చీర(కంచిపట్టుచీర)ను బ్లౌజ్ మెటీరియల్‌తో పాటు స్టిచింగ్ కోసం 2025 జనవరి 25వ తేదీన బంజారాహిల్స్‌లోని బీ డిజైన్ ఫర్ యూ దుకాణంలో ఇచ్చారు. ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రంలోగా డెలివరీ చేయాలని కోరారు. అడ్వాన్స్‌గా రూ.2500 చెల్లించారు. అయితే ఫిబ్రవరి 5వ తేదీన అమృతవర్షిణికి బీ డిజైన్ ఫర్ యూ కంపెనీ నుంచి కాల్ చేసి పొరపాటు జరిగిందని చెప్పారు.
బ్లౌజ్ మెటీరియల్‌ను తప్పుగా కట్ చేశాం క్షమించండి అని కోరారు. దీనికి అమృతవర్షిణి ఆందోళన చెందగా.. ఎవరూ కనిపెట్టలేని విధంగా మగ్గం వర్క్ చేసి రీజాయిన్ చేసిస్తామని హామీ ఇచ్చారు. కానీ దాన్ని వారు నిలబెట్టుకోలేదు. పెళ్లికి ధరించలేని స్థితిలో బ్లౌజ్ ఉండటంతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది. కొత్త చీర ఇవ్వాలని లేదంటే దాని ధర చెల్లించాలని డిమాండ్ చేసింది. దానికి డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత స్పందించలేదు. దీంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. వాట్సాప్ చాట్, ఫొటోలు, చీర, రసీదులను సమర్పించారు. వీటిని పరిశీలించిన కమిషన్.. రూ.లక్ష పరిహారం, రూ.వేలు కేసు ఖర్చులను చెల్లించాలని తీర్పునిచ్చింది.