హనుమకొండ, ఏప్రిల్ 5: కేరళం రాష్ట్రంలో గొప్పలు చెప్పిన రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి గత అసెం బ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలయ్యాయని నిరూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని శాసనమండలిలో ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ సిరికొండ మ ధుసూదనాచారి సవాల్ విసిరారు. శాసనమండలి, శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు ప్రజలకు ఇచ్చిన హామీలపై సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం ని ర్వహించారు.
సిరికొండ మాట్లాడుతూ సీఎం స్థాయిని రేవంత్‌రెడ్డి విస్మరించి వింతగా, తెలంగాణ గౌరవాన్ని దిగదార్చేలా కల్లుతాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్తును అభాసుపాలు చేస్తున్న అర్భకుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హనుమంతుడి ముందు కుప్పి గం తులు వేసినట్లుగా కేరళలో సీఎం పినరయ్ విజయన్‌కు పాఠాలు నేర్పడం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో ముఖ్య నేతగా ఉన్న విజయన్‌పై మాట్లాడే స్థాయి సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి రేవంత్ మన ప రువు తీస్తున్నారని విమర్శించారు. కేరళంలో రేవం త్ మాట్లాడుతూ నేను ైప్లెట్ ఏర్పాటు చేస్తాను.. మా తెలంగాణకు వచ్చి గ్రామాల్లో తిరిగి మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో చూ డాలనడం విడ్డూరంగా ఉందని, హామీలు అమలు చేసినట్లు నిరూపించాలని సిరికొండ సవాల్ విసిరారు.
అసెంబ్లీ, శాసనమండలిలో అత్యంత ప్రధాన అంశాలైన గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ పద్దులపై చర్చలు నడుస్తున్న సమయంలో సీఎం రేవం త్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాడని వివరించారు. శనివారం గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసుపై చేసిన దాడి ప్రభుత్వ కార్యాలయంపై దాడేనన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆఫీసులో ప్రధానమంత్రి మోదీ ఫొటో పెట్టారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌పై బురజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ మంత్రి పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నెగెటివ్‌గా మాట్లాడారని, ఆయనకు తన శాఖపై పూర్తి అవగాహన లేదన్నారు.
స్టేషన్ ఘన్‌పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో ఆ నియోజకవర్గ ప్రజలతో రెఫరెండం పెట్టిస్తే తెలుస్తుందన్నారు. బయటకు వస్తే కాంగ్రెస్ అంటూ, విచారణ జరిపితే ఎమ్మెల్యే పదవి పోతుందని బీఆర్ఎస్లో ఉన్నానని కడియం శ్రీహరి చెప్పడం ఊసరవెళ్లి రాజకీయాన్ని తలపిస్తున్నదన్నారు. మేడారం జాతరలో నాసిరకం పనులు చేయడంతోనే రెండు టన్నుల బండరాయి బాలుడి కాలుపై పడి తీవ్ర గాయాలవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి కాలు తొలగించారని, బాధితుడిని శనివారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అందరూ మేడారంలో వాటాలు పంచుకొనేందుకు మాత్రమే క్యాంపులు ఏర్పాటు చేశారని విమర్శించారు.
ప్రమాదాలపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో భూగర్భ జలాలు సమృద్ధి ఉంటే కాంగ్రెస్ పాలనలో అడుగంటుతున్నాయని, దీంతో వ్యవసాయ బావుల్లో రైతులు పూడిక తీస్తున్నారని తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలో క్రేను బావిలో పడి ముగ్గురు చనిపోతే నేటికీ ప్రజాప్రతినిథులు, అధికారులెవరూ మృతుల కుటుంబాలను పరామర్శించలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు చూస్తుంటే మరో తుపాకి రాముడి మా టలు అని అధికారులకు సైతం అర్థమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట సీరియల్లా హాస్టళ్లలో పుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటున్నదన్నారు. రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, ప్రజాపీడిత పాలన అని మధుసూదనాచారి ఆరోపించారు.
పక్క రాష్ట్రం తరహాలో తెలంగాణలో ఫ్యాక్ష న్ రాజకీయాలు, దాడులకు సీఎం రేవంత్‌రెడ్డి పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని క్యాంపు కార్యాలయంపై దాడి దుర్మార్గమైన చర్య అని, ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై అధికార పక్ష దాడిని ప్రజాస్వామ్యంలో దాడిగా పరిగణిస్తున్నామన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీస్తుంటే దిక్కుతోచని స్థితిలో కాంగ్రె స్ దాడులకు తెగబడుతున్నదన్నారు. హామీలు మరిచి దాడులతో డైవర్షన్, కరప్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఆరోపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వారికి ఎలా బుద్ది చెప్పాలో తెలంగాణ ప్రజానికానికి తెలుసని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రాబో వు రోజుల్లో ప్రజాక్షేత్రంలోని ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజలు మిమ్ములను వెంటాడుతారని ఆయన హెచ్చరించారు. అం తకు ముందు భారత ఉపప్రధాని, భారతరత్న బాబు జగ్జీవన్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్ర మంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, ఏలిమి సతీశ్, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్ధన్‌గౌడ్, కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ ముదిరాజ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నయీమొద్దీన్, సల్వాజి రవీందర్రావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొడకండ్ల సదాంత్, పున్నం చందర్ , నాయకులు పానుగంటి శ్రీధర్, జానకి రాములు, పోలపల్లి రామ్మూర్తి, సుదర్శన్, సారిక, సౌరం రఘు, గండ్రకోట రాకేశ్‌యాదవ్, మూటికరాజు యాదవ్, సంపతి రఘు, వీపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.