పెద్దపల్లి, జూలై 22: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి – కూనారం ఆర్వోబీ వద్ద రైల్వే పట్టాలపై(Railway tracks) లారీ నిలిచిపోవడంతో కాసేపు హైటెన్షన్ నెలకొన్నది. బుధవారం రాత్రి కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ( Lorry)పెద్దపల్లి – కూనారం ఆర్వోబీ వద్దకు వచ్చింది. అయితే రైలు పట్టాల మధ్య ఎగుడు దిగుడు ఉండడం, లారీ అధిక లోడ్‌తో ఉండడం వల్ల ముందుకు కదల్లేకపోయింది.
వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై పలు రైళ్లను నిలిపి వేశారు. స్థానికుల సాయంతో లారీని ముందుకు తోసేందుకు ప్రయత్నించగా, ఎంతకి కదల్లేదు. చివరగా క్రేన్ సాయంతో పట్టాలపై నుంచి లారీని ముందుకు తీసుకెళ్లారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా ఇటీవల పట్టాల మరమ్మతులు సరిగ్గా చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు.